CM Jagan Credited Rythu Bharosa Funds: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. అందుకే ప్రభుత్వం వేసే ప్రతీ అడుగులోనూ అన్నదాతకు అండగా నిలిచామని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. బుధవారం వైఎస్సార్ రైతు భరోసా (Rythu Bharosa) పెట్టుబడి సాయం సొమ్మును.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. అలాగే, రబీ 2021 - 22, ఖరీఫ్ - 2022 సీజన్లకు గానూ అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. 'రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నాం. మొత్తం 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమ చేశాం. కౌలు రైతులకు, అటవీ, దేవాదాయ భూముల సాగు రైతులకు సాయం చేశాం. 57 నెలల్లో రైతు భరోసా కింద రూ.34,288 కోట్లు అందించాం. మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్నా ఒక్కో రైతుకు అదనంగా రూ.17,500 ఇస్తున్నాం.' అని సీఎం వివరించారు.
'ఇది రైతు ప్రభుత్వం'
తమది రైతు ప్రభుత్వం అని సీఎం జగన్ అన్నారు. ‘ప్రభుత్వం వేసిన ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలనే వేశాం. అన్నదాతకు అండగా పెట్టుబడి సాయం అందించాం. రాష్ట్రంలో దాదాపు 50 లోపు రైతులకు ఉన్న భూమి అర హెక్టార్ లోపలే. హెక్టార్ లోపల ఉన్న రైతులు 70 శాతం ఉన్నారు. ఈ పెట్టుబడి సాయం అన్నదాతలకు ఎంతో మేలు చేసింది. వంద శాతం మంది రైతులకు రైతు భరోసా కింద 80 శాతం ఖర్చు కవర్ అయ్యింది. సున్నా వడ్డీ కింద రూ.215.98 కోట్లు విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకూ 84.66 లక్షల మంది రైతులకు రూ.2,050 కోట్ల వడ్డీ రాయితీ అందించాం.’ అని జగన్ పేర్కొన్నారు.
'నాణ్యమైన ఉచిత కరెంట్'
19 లక్షల మంది రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ‘ఏడాదికి దాదాపు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. రైతుల తరఫున ఉచిత పంటల బీమాకు ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. రైతులకు ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చాం. గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను పెట్టాం. ఈ - క్రాప్ చేస్తూ అన్ని విధాలుగా వారికి అండగా ఉన్నాం. ఆక్వా రైతులకు రూ.1.5కే కరెంట్ ఇస్తూ చేయూత అందించాం. పాల సేకరణలోనూ రైతుకు తోడుగా నిలిచి వారికి మంచి ధర వచ్చేలా చేశాం.’ అని వివరించారు.
అలాగే, వివాదాలకు చెక్ పెట్టేలా సమగ్ర భూ సర్వే నిర్వహించామని సీఎం తెలిపారు. 34.77 లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులను రైతులు, పేదలకు కల్పించినట్లు చెప్పారు. వివిధ పథకాల ద్వారా రూ.1.2 లక్షల కోట్లు రైతన్నలకు అందించామని స్పష్టం చేశారు.
Also Read: Minister Ambati: అసెంబ్లీ ఎన్నికల ప్రచార 'సిత్రం' - టీ కాచి దోశలు వేసిన మంత్రి అంబటి రాంబాబు