Himachal Pradesh Political Crisis Updates: హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మొదలైంది. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే అక్కడి ప్రభుత్వం కూలిపోయేందుకు అవకాశాలు కనిపిస్తుండడం అలజడి రేపుతోంది. కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారన్న ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అలెర్ట్ అయింది. అసెంబ్లీలో బల పరీక్ష చేపట్టాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిశారు కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు. సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కరే అభ్యర్థిని బరిలోకి దింపిన బీజేపీ విజయం సాధించింది. ఆ వెంటనే అక్కడ రాజకీయాలు నాటకీయంగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం సంచలనమైంది. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసినట్టు సమాచారం.
"రాజ్యసభ ఎన్నికల్లో మేం ఘన విజయం సాధించాం. ఇక్కడ మాకు విజయావకాశాలు తక్కువే అనుకున్నప్పటికీ గెలిచాం. దీన్ని బట్టే అర్థం అవుతోంది..కాంగ్రెస్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని"
- జైరామ్ ఠాకూర్, ప్రతిపక్ష నేత
రాజ్యసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని భావించిన కాంగ్రెస్‌కి షాక్ తగిలింది. కాంగ్రెస్ తరపున అభిషేక్ మను సింఘ్వీ పోటీ చేయగా..బీజేపీ తరపున హర్ష్ మహాజన్ బరిలోకి దిగి విజయం సాధించారు. ఇద్దరికీ 34 ఓట్లు వచ్చాయి. ఆ తరవాతే కాంగ్రెస్‌కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ అభ్యర్థికి మద్దతునిచ్చారు. అలా హర్ష్ మహాజన్ విజయం సాధించారు. అయితే...ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కనిపిస్తుండడం వల్ల కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. సీనియర్ నేత భూపీందర్ సింగ్ హుడాతో పాటు కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. ఫిరాయింపుకి పాల్పడిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన ఆరుగురు ఎమ్మెల్యేలు వెంటనే హరియాణా వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై డీకే శివకుమార్ స్పందించారు. హైకమాండ్ ఆదేశాల మేరకు ఇక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు.
"ఈ పరిణామాల్ని పరిశీలించాలని హైకమాండ్ నాకు ఆదేశాలిచ్చింది. బీజేపీ ఎందుకింత తొందర పడుతోందో అర్థం కావడం లేదు. ప్రభుత్వానికి ఓ బలమైన ప్రతిపక్షం ఉండాలి. కానీ ఇలాంటివి మానుకోవడం మంచిది. ఎప్పుడో అప్పుడు అది తిరిగి వాళ్లకీ జరిగే అవకాశాలున్నాయి. మా ఎమ్మెల్యేలందరూ మా పార్టీకి విధేయంగా ఉంటారన్న నమ్మకముంది"
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం