Annamalai Special Tweet on His Padayatra: తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai) చేపట్టిన 'నా మట్టి.. నా ప్రజలు' పాదయాత్ర (En Mann En Makkal Padayatra) మంగళవారంతో ముగిసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమ పార్టీ అభ్యర్థులు పార్లమెంటులో అడుగు పెట్టడమే లక్ష్యంగా, మూడోసారి ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టేందుకు ప్రజా మద్దతును కూడబెట్టేలా గతేడాది జూలై 28న ఈ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలు, 39 లోక్ సభ నియోజకవర్గాలను కలుపుతూ అన్నామలై యాత్ర పలు విధాలుగా సాగింది. మంగళవారంతో ఈ యాత్ర ముగియగా.. తిరుప్పూర్ జిల్లా పల్లడంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. కాగా, అన్నామలై చేపట్టిన ఈ యాత్రకు అనేక జిల్లాల్లోని నియోజకవర్గాల్లో విశేష స్పందన లభించింది. అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా పాదయాత్రలో మమేకమయ్యారు.


'ప్రజల అభిమానం అసమానం'






కాగా, 'నా మట్టి.. నా ప్రజలు' పాదయాత్ర ముగింపు సందర్భంగా అన్నామలై ప్రత్యేక ట్వీట్ చేశారు. 'పాదయాత్ర ద్వారా గత 6 నెలల్లో తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేశాం. ఈ ప్రయాణంలో ప్రధాని మోదీపై ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయత అసమానం. కేంద్ర హోం మంత్రి ప్రారంభించిన ఈ పాదయాత్ర ముగింపు సభ ప్రధాని మోదీ నేతృత్వంలో జరగడం జీవిత కాల అనుభవం. మళ్లీ మోదీయే ప్రధాని.' అంటూ ట్వీట్ చేశారు.


'తమిళనాడు బీజేపీ గుండెల్లో ఉంటుంది'


తమిళనాడు రాష్ట్రం ఎప్పుడూ బీజేపీ గుండెల్లో ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ రాష్ట్రంతో తనకున్న అనుబంధం దశాబ్దాల నాటిదని చెప్పారు. మంగళవారం ఆయన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలోని ఏసీ రూముల్లో కూర్చుని దేశ సమగ్రతను దెబ్బ తీయాలని కలలు కంటున్నారని.. అలాంటి వాళ్లు తమిళనాడుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలో లేకపోయినా.. ఈ రాష్ట్రంపై మాకు ప్రేమ తగ్గదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమిళనాడును దోచుకున్న వారికి.. ఇక్కడ బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి భయపడుతున్నారని అన్నారు.


బీజేపీకి జై కొట్టిన వాసన్


అటు, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రయాణించేందుకు తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ నిర్ణయించారు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అరవింద్ మీనన్ తో సమావేశం అనంతరం బీజేపీతో కలిసి ఎన్నికలు ఎదుర్కోనున్నట్లు తెలిపారు. అలాగే, పుదియ నీది కట్చి నేత ఏసీ షన్ముగం సైతం బీజేపీతో కూటమిని ఖరారు చేశారు. మరికొన్ని పార్టీల నేతలు సైతం బీజేపీతో పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.


Also Read: AM Khanwilkar: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ ఖాన్విల్కర్‌, సభ్యుల నియామకం