Lokpal Chairperson AM Khanwilkar: ఢిల్లీ: లోక్‌పాల్ ఛైర్ పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ (AM Khanwilkar) నియమితులయ్యారు. ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలక్షన్ కమిటీ ఆయన పేరును ఇదివరకే సూచించగా.. దాదాపు మూడు వారాల తర్వాత ఈ నియామకం జరిగింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. భారత తొలి లోక్‌పాల్‌ జస్టిస్ పినాకి చంద్రఘోష్ పదవీకాలం 2022 మే నెలలో పూర్తయింది. అప్పటినుంచి లోక్‌పాల్ ఛైర్ పర్సన్ స్థానం ఖాళీగా ఉంది. జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతిని లోక్‌పాల్ తాత్కాలిక ఛైర్ పర్సన్‌గా నియమించగా.. ఆయన సేవలు అందిస్తున్నారు. ప్రదీప్ కుమార్ మొహంతి జార్ఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.


హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్ యాదవ్, జస్టిస్‌ రుతురాజ్ అవస్థీ, జస్టిస్‌ లింగప్ప నారాయణస్వామిలను లోక్‌పాల్ జ్యుడిషియల్‌ సభ్యులుగా నియమించారు. నాన్-జ్యుడిషియల్ సభ్యులుగా పంకజ్ కుమార్, అజయ్ టిర్కీ, సుశీల్ చంద్రలు నియమితులయ్యారు. ప్రభుత్వానికి చెందిన కొన్ని విభాగాల ఉద్యోగులపై వచ్చే అవినీతి కేసులపై ఫోకస్ చేయడం లోక్‌పాల్ సంస్థ ప్రధాన కర్తవ్యం. మే 2022లో పదవీ విరమణ చేసిన పినాకి చంద్ర ఘోష్ తర్వాత భారతదేశానికి రెండవ లోక్‌పాల్ ఖాన్విల్కర్ అవుతారు. ఈ నియామకాలు వారు తమ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.


ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై విచారణకు సంబంధించి లోకాయుక్త చట్టం 2013 తెచ్చారు. ఈ లోక్ పాల్‌లో ఓ చైర్‌పర్సన్, 8 మంది సభ్యులు ఉంటారు, వీరిలో 50% మంది న్యాయవ్యవస్థకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. సభ్యులు ఐదు సంవత్సరాలు, వారికి 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పదవీకాలం కలిగి ఉంటారని తెలిసిందే.