Siddipet Road Accident: సిద్దిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ కి చెందిన భార్యాభర్తలు సహా డ్రైవర్ మృతి చెందాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్లకు చెందిన తాండ్రపాపారావు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం కరీంనగర్‌లో నివసిస్తున్నారు. ఆదివారం తన భార్య పద్మతో కలిసి ఓ ప్రైవేట్ కార్ రెంట్ కి తీసుకొని హైదరాబాద్ కి బయలుదేరారు. నాగుల మల్యాలకు చెందిన గుంటి ఆంజనేయులు అనే వ్యక్తిని డ్రైవర్‌గా నియమించుకున్నారు. 


మల్లారం శివారులో గల మైసమ్మ గుడి సమీపంలోకి రాగానే ఎదురుగా ఒక లారీ రాంగ్ రూట్ లో వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిద్ధిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాంగ్ రూట్లో వచ్చి నిండు ప్రాణాలను బలిగొన్న డ్రైవర్ కనీసం ప్రమాదం జరిగిన విషయం పై కూడా మాట్లాడలేనంత మత్తులో తూలుతూ ఉన్నాడు.


నెల కిందట తండ్రి... ఇప్పుడు కొడుకు, కోడలు...
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరేళ్ళకి చెందిన తాండ్రపాపా రావు గతంలో స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో చాలాకాలంపాటు లెక్చరర్‌గా పనిచేశారు. ఆరేళ్ల కిందట రిటైర్మెంట్ తీసుకొని భగత్ నగర్‌లో సొంత ఇంటిలో భార్యతో కలిసి నివాసముంటున్నారు. పాపారావు కుమారుడు విదేశాల్లో సెటిలయ్యారు. అయితే పాపారావు తండ్రి సూర్యారావు గత నెల 5వ తారీఖున స్వగ్రామంలో మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించి రెండు రోజుల కిందట నెల మాసికం కూడా నిర్వహించారు. భార్యతో కలిసి తిరిగి ఇంటికి చేరుకున్న పాపారావు దంపతులు బంధువుల ఇంటికి వెళ్లడానికి హైదరాబాద్ బయలుదేరారు. 


జాగ్రత్తలు తీసుకున్నారు.. కానీ
సొంత వాహనం ఉన్నా కూడా ఈ మధ్య కాస్త ప్రయాణాలు ఎక్కువ  కావడంతో అద్దెకి కార్ తీసుకొని ప్రైవేటుగా డ్రైవర్ ని పెట్టుకుని మరీ వెళ్లారు. అయినా విధి వీరిద్దరినీ రోడ్డు ప్రమాదంలో బలితీసుకుంది .మరోవైపు పాపారావు భార్య పద్మ ఐదుగురు అన్నదమ్ముల్లో ఒక్కరే సోదరి.. దురదృష్టం ఏంటంటే అక్కడికి సమీపంలోనే వారి సోదరులు ఇద్దరూ సొంత బిజినెస్ పని పై వచ్చారు. ప్రమాద వార్త తెలుసుకుని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రోదించడం చూపరులను కలచివేసింది .


కష్టాలను అధిగమించి..సెటిల్ అయ్యే టైమ్‌లో.. 
ఇక కారు డ్రైవర్ గొంటి ఆంజనేయులు కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీ నగర్ లో నివాసం ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చాలా కాలం పాటు ప్రైవేటు డ్రైవర్ గా పనిచేసిన ఆంజనేయులు తర్వాత సొంతంగా కార్ కొని ఈ మధ్య కొంత ఆర్థికంగా సెటిల్ అయ్యాడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం కూడా రోడ్డున పడింది. 


Also Read: Road Accident In Alluri District: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం - ప్రైవేట్ బస్సు బోల్తా, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి


Also Read: Fashion Designer Pathyusha: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు, సూసైడ్ నోట్, పెన్ డ్రైవ్ స్వాధీనం