Three dies in private bus overturns in Alluri Seetharamaraju District:  ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


అసలేం జరిగిందంటే..


ఒడిశాలోని చిన్నపల్లి నుంచి ప్రైవేటు బస్సు విజయవాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద అదుపు తప్పిన ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారని సమాచారం. మృతులంతా ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులను ధనేశ్వర్‌ దళపతి(24), జీతు హరిజన్‌(5), సునేనా హరిజన్‌(2), మరో ఇద్దరు ఉన్నట్లు గుర్తించారు.


కూలీ పనులకు ఒడిశాలోని చిన్నపల్లి నుంచి ఏపీలోని విజయవాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి అతివేగం కారణమా, లేక డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడిపాడా అని అన్ని కోణాల్లో ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.