Shraddha Murder Case:
వెంట్రుకలు, ఎముకల డీఎన్‌ఏ పరీక్ష..
శ్రద్ధా హత్య కేసులో కీలక విషయం వెల్లడైంది. విచారణలో భాగంగా సేకరించిన వెంట్రుకలు, ఎముకల నమూనాలు శ్రద్ధవేనని తేలింది. డీఎన్‌ఏ రిపోర్ట్ ఇది వెల్లడించింది. స్పెషల్ సీపీ సాగర్ ప్రీత్ హుడా DNA రిపోర్ట్‌లో నమూనాలు, శ్రద్ధ డీఎన్‌ఏతో మ్యాచ్ అయినట్టు చెప్పారు. ఇప్పటికే ఈ రిపోర్ట్ ఢిల్లీ పోలీసులకు అందింది. ఈ శాంపిల్స్‌ని హైదరాబాద్‌లోని Center for DNA Fingerprinting and Diagnosticsలో DNA మైటోకాండ్రియల్ ఎగ్జామినేషన్ ద్వారా పరీక్షించారు. రిపోర్ట్ అందే వరకూ పోస్ట్‌మార్టం నిలిపివేశారు. ఇప్పుడు నివేదిక అందినందున...పోస్ట్‌మార్టం చేయనున్నారు. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అఫ్తాబ్ అమీన్ పూనావాలాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్‌క్వార్టర్స్‌కు పోలీసులు తీసుకువెళ్లారు, ఈ కేసుకు సంబంధించి వాయిస్ శాంప్లింగ్ పరీక్ష కోసం ఇక్కడకు తీసుకువచ్చినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది. నిందితుడు అఫ్తాబ్.. శ్రద్ధాతో గొడవపడుతోన్న ఓ ఆడియో క్లిప్ దిల్లీ పోలీసులకు దొరికింది. అనంతరం దిల్లీ కోర్టు ఆదేశాల మేరకు వాయిస్ శాంప్లింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎన్‌డీటీవీ వెల్లడించింది. పోలీసులు.. ఈ ఆడియో క్లిప్‌ను "పెద్ద సాక్ష్యం"గా పరిగణిస్తున్నారు. కోల్డ్ బ్లడెడ్ హత్య వెనుక ఉద్దేశాన్ని ఈ క్లిప్ తెలియజేస్తుందని సమాచారం. తనకు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ను అఫ్తాబ్ ఉపసంహరించుకున్నాడు. అఫ్తాబ్‌యే బెయిల్ వద్దని చెప్పడంతో దిల్లీ సాకేత్ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన అఫ్తాబ్ తాను డిసెంబరు 15న కోర్టులో వేసిన తన బెయిల్ అభ్యర్థనను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నానని తెలిపాడు.