తెలంగాణా రాష్ట్రం వందలాది మంది అమరవీరుల త్యాగ ఫలం. దశలవారీగా జరిగిన తెలంగాణా ఏర్పాటు ఉద్యమాల్లో ఎంతో మంది తమ ధన,ప్రాణాలను తృణప్రాయంగా కోల్పోయారు. 1969లో తొలి దశ తెలంగాణ సాధన పోరటం మొదలు మలిదశ ఉద్యమం ద్వారా 2014లో తెలంగాణ సాధించే వరకూ వందల మంది అశువులు బాశారు. అమరుల త్యాగాలు భావితరాలకు గుర్తుండేలా, వారికి నివాళిగా అమరవీరుల భవనం ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో బీఆర్‌ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి కేసిఆర్ ఆధ్వర్యంలో స్మృతి భవనం ఏర్పాటుకు కసరత్తు జరుగుతూనే ఉంది. సరిగ్గా మూడున్నర ఏళ్ల క్రితం హుస్సేన్ సాగర్ ఒడ్డున జలవిహార్‌కు సమీపంలో తెలంగాణ అమరవీరులజ్యోతి స్మారక చిహ్నం నిర్మాణానికి పునాది పడింది. అరుదైన కట్టడంగా అమరవీరుల స్థూపం నిర్మించేందుకు శంకుస్దాపన చేయడంతో తొలిఅడుగు పడింది.
అమరజ్యోతి నిర్మాణంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణంగా ఈ అమరజ్యోతి అరుదైన రికార్డ్ సృష్టించబోతోది. 3.29ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ వైవిధ్య నిర్మాణం అంచనా వ్యయం 179 కోట్లు. 48మీటర్ల ఎత్తులో, 50మీటర్ల వెడల్పుతో, 28 అడుగుల లోతులో మూడు అంతస్తులతో వెలుగుతున్న జ్యోతి రూపంలో తెలంగాణా అమరవీరుల స్దూపం ఆకట్టుకోనుంది.
ఎటువంటి అతుకులు లేకుండా జ్యోతి భారీ ప్రమిదను పోలిన ఆకారంలో కనిపించడం ఈ నిర్మాణం మరో ప్రత్యేకత. ప్రమిదకు ముందు భాగంలో వెలుగుతున్న ఒత్తి ఆకారంలో ఎత్తైన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ కట్టడం లోపలి భాగంలో మూడు అంతస్థులు నిర్మించి మొదటి అంతస్థులో మ్యూజియం, రెండో అంతుస్థులో కన్వెషన్ హాల్, మూడో అంతస్థులో దీపాకార్ని దర్మించేలా ప్రత్యేకంగా నిర్మాణం రూపొందించారు.
అమరజ్యోతిని ఆనుకుని బయటవైపు చుట్టూ ఆహ్లాదకరమైన గ్రీనరీతో కూడిన పార్క్ పై నుంచి కిందకు జూలువారతున్న నీటి ప్రవాహం అందాలు, మధ్యలో తెలంగాణా తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. నిర్మాణానికి క్రింద భాగంలో సెల్లార్‌లో అతిపెద్ద పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశామని నిత్యం వందలాదిమంది సందర్శకుల తాకిడి, ట్రాఫిక్ సమస్యల నేపధ్యంలో విశాల పార్కింగ్ స్థలం కేటాయించనట్లు శిల్పి వెంకట రమణారెడ్డి ABP దేశంతో తెలిపారు.
శంకుస్దాపన చేసిన నాటి నుంచి ఎంతో మంది శిల్పులు ఇచ్చిన తెలంగాణా అమరుల స్థూపం నమూనాలను పరిశీలించిన సిఎం కేసిఆర్ చివరకు తాను రూపొందించిన నమోనాకు అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందని చరిత్రలో నిలిచిపోయే త్యాగాల చిహ్నంగా అమరజ్యోతి నిర్మాణం ఉండబోతోందని వెంకట రమణారెడ్డి తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే కట్డం అంటే నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. అందులోనూ
సెంటిమెంట్‌తో కూడిన అమరవీరుల స్మారక చిహ్నం అంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అందుకే నిర్మాణం మొదలైన నాటి నుంచి నేటికి సుమారుగా ఐదువేల మంది కార్మికులు దశలవారీగా ఇక్కడ పనిశారు. దుబాయ్ నుంచి వచ్చిన నిపుణులతోపాటు రోజూ వందల మంది వేగంగా తెలంగాణా అమరజ్యోతి నిర్మాణం పూర్తి చేసేందుకు రేయింభవళ్లు శ్రమిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో హుస్సేన్ సాగర్ ఓడ్డున, జలవిహార్‌కు ఆనుకుని అమరజ్యోతి స్థూపం తెలుగు రాష్ట్రాల పర్యాటకులతోపాటు విదేశీయులను సైతం ఆకట్టుకోనుంది.