TSRTC Sleeper Buses: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి స్లీపర్ స్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇలా టీఎస్ఆర్టీసీకి 10 బస్సులు సమకూరాయి. వీటిలో పూర్తి స్లీపర్ బస్సులు 4 కాగా.. 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఇవి హైదరాబాద్ - కాకినాడ, హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీ బస్సు స్టాపు దగ్గర బుధవారం సాయంత్రం 4 గంటలకు వీటిని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు. 






బస్సు టైమింగ్స్ ఇవే..!



  • కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బయలుదేరుతాయి. కాకినాడ నుంచి హైదరాబాద్ కు రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాయి. 

  • విజయవాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్ నుంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదం 10.15, 11.15 మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరుకు ప్రయాణం అవుతాయి.  






సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ ఆఫర్


సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుక్ చేస్కుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్న తెలిపింది. డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కి ఈ రాయితీ వర్తిస్తుందని... వచ్చే జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ సజ్జనాల్ తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించ వచ్చని స్పష్టం చేశారు.