Makar Sankranti 2023: భోగి మంటలు, రంగు ముగ్గులు, గొబ్బిళ్లు, పిండివంటలు, కోడి పందాలు, పతంగులు, కొత్త అల్లుళ్లు, ఇల్లంతా బంధువులు... ఒకటా రెండా..సంక్రాంతి గురించి చెప్పుకుంటూ పోతే చేంతాడంత జాబితా ఉంది. అయితే అంతా కలసి ఆనందంగా గడిపే క్షణాలను మరింత ఆనందంగా మార్చుకునేందుకు చిన్న చిన్న పనులు చేయమంటున్నారు పండితులు.
నదీస్నానం ఉత్తమం
మకర సంక్రాంతి రోజున గలగలపారే నీటిలో స్నానం చేయడం చాలామంచిదంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఈరోజు గంగా నదిలో కానీ, తమకు సమీపంలో ఉన్న నదిలో కానీ స్నానం చేస్తారు. ఈ అవకాశం లేనివారు... గతంలో నదీస్నానానికి వెళ్లినప్పుడు బాటిల్స్ లో తీసుకొచ్చిన నీటిని ట్యాంక్ లో మిక్స్ చేసి చేసినా కొంత ఫలితం ఉంటుంది.
Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
సూర్యుడికి నమస్కారం చేయండి
ఉరకల పరుగల జీవితంలో ఎప్పుడు నిద్రపోతున్నామో, ఎప్పుడు లేస్తున్నామో పట్టించుకోవడం లేదు. కొందరైతే సూర్యోదయం కూడా చూడరు...ఏ అర్థరాత్రికో వచ్చి నిద్రపోయి పొద్దెక్కాక లేచి ఆఫీసులకు వెళ్లిపోతున్నారు. సంక్రాంతి అనేసరికి సాధారణంగా ఆ మూడు రోజు ఏ పనులు పెట్టుకోరు..కార్యాలయాలకు దూరంగా సొంతూర్లతో సంతోషంగా గడుపుతారు. అందుకే ఆ మూడు రోజులైనా తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి..సూర్యుడికి అర్ఘ్యం( దోసిలితో నీరు) అర్పించండి. మకర రాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఇప్పటి వరకూ జీవితంలో ముసురుకున్న చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం.
మీ శక్తి మేరకు దానం చేయండి
పండుగ అంటేనే అంతా సంతోషంగా ఉండడం. అందుకే ఈ రోజున పేదలకు అన్నదానం చేయండి. వస్త్రదానం మరీ మంచిది. ఇంటింటా సందడి చేసే డూడూ బసవన్నకి ఆహారం అందించండి. మీకు సమీపంలో ఉన్న పశువుల పాకకు,గోశాలలకు వెళ్లి వాటికి ఆహారం అందించి నమస్కరించి రండి. ముఖ్యంగా ఈ రోజు నల్లనువ్వులు దానం చేయడం చాలా మంచిదంటారు.
పిండి వంటలు పంచుకోండి
సంక్రాంతికి దాదాపు పది రోజుల ముందు నుంచీ పిండివంటలు ఘుమఘుమలాడిపోతుంటాయి. ఏ ఇంట చూసినా పిండి వంటలు తయారీనే. కొందరు పండుగ రోజు నువ్వులు తినడం ఏంటనే సెంటిమెంట్ తో ఉంటారు కానీ చాలా ప్రాంతాల్లో నువ్వులతో చేసిన వంటలను సంక్రాంతికి ఆస్వాదిస్తారు. లడ్డు, ఖిచ్డి తయారు చేసి పంపిణీ చేస్తారు. ఇన్ని చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం అని చెప్పుకోవడం కాదు..సరదాగా చుట్టుపక్కల వారితో మీరు చేసిన వంటకాలు పంచుకోండి.
Also Read: Also Read: శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి
ఆకలితో ఉన్నవారు కనిపించకూడదు
పండుగ రోజుల్లో మధ్యాహ్నం భోజనం తర్వాత భుక్తాయాసం తీర్చుకునేందుకు మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని అలా చుట్టేసి రండి. ఎక్కడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఆ రోజు వారికి మీకు తోచిన సాయం చేయండి. దేవుడు ఎక్కడో ఉండడు..మనం చేసే సాయం లోనూ, ఆకలితో ఉండేవారికి పెట్టే అన్నంలోనే ఉంటాడంటారు కదా..అందుకే పండుగ రోజు మనం పది రకాల వంటకాలతో భోజనం చేయడం కాదు.. పస్తులున్న వారికి గుప్పెడు మెతుకులు ఇవ్వడం కన్నా పెద్ద పండుగ ఏముంది.