Makar Sankranti Shani Effect: సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటాం. మకర రాశికి అధిపతి శని...శని ఎవరో కాదు సాక్షాత్తూ ఆ సూర్య భగవానుడి కుమారుడు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు తన దిశ మార్చుకున్నప్పుడు తన కుమారుడు శనితో కలసి దాదాపు నెలరోజులు ఉంటాడని పండితులు చెబుతారు. అంటే ఆ నెల రోజులు సూర్యుడి తేజస్సు మందు శనిదేవుడి తేజస్సు మసకబారుతుంది..అంటే శని ప్రభావం తగ్గుతుంది. పురాణాల్లో చెప్పిన విషయాల ప్రకారం... సంక్రాంతి రోజున తన ఇంటికి వచ్చిన తండ్రి సూర్య భగవానుడికి శని..తనకు ఇష్టమైన నల్ల నువ్వులతో స్వాగతం పలుకుతాడు. సంతోషించిన సూర్యుడు..ఈ రోజు ఎవరైతే తనకు నల్ల నువ్వులు సమర్పిస్తారో వారికి శని బాధలు తొలగి, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో వర్థిల్లుతారని చెప్పాడట. అందుకే ఏటా మరక సంక్రాంతి రోజు సూర్యుడి పూజలో నల్ల నువ్వులు ఉపయోగిస్తారని చెబుతారు. సూర్యుడికి, శనికి ప్రీతికరమైన నల్లనువ్వులను సంక్రాంతి రోజు ధారపోసినా, దానమిచ్చినా శని బాధల నుంచి ఉపశమనం లభించి వారి జీవితంలో వెలుగులు ప్రసరిస్తాయని చెబుతారు.
Also Read: భోగి రోజు మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి
మకర సంక్రాంతి రోజు దానం, పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందంటారు. అందుకే సంక్రాంతి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి నల్లనువ్వులు కలిపిన నీటిని సూర్యుడికి సమర్పించాలి. ఆ తర్వాత శనిని తలుచుకుని నువ్వులు సమర్పించాలి. ఈ రోజున ఆవనూనె, నల్ల నువ్వులు, నువ్వుల లడ్డూ..పూజ పూర్తైన తర్వాత ఎవరికైనా దానం ఇచ్చినా శని బాధలనుంచి విముక్తి లభిస్తుంది.
Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!
అస్సాంలో మకర సంక్రాంతి రోజున బిహు జరుపుకుంటారు. ఈ రోజును ప్రజలు కొత్త పంటలను సేకరించి ఇంటికి తీసుకువస్తారు. ఈ సమయంలో అనేక రకాల వంటకాలు తయారుచేస్తారు. తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్ జరుపుకుంటారు. ఈ రోజున సూర్య భగవానుడికి ఖీర్ సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లలో మకర సంక్రాంతి రోజున ప్రత్యేకంగా తయారు చేసుకుని ఖిచిడీని తింటారు. అందుకే దీన్ని ఖిచ్డీ అని అంటారు. గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ఖిచ్డీని అందించే సంప్రదాయం ఉంది. ఈ రోజు నుంచి ప్రయాగరాజ్‌లో మాఘమేళా నిర్వహిస్తారు. మకర రాశిని మాఘి అని కూడా అంటారు.
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15 ఆదివారం వచ్చింది. ఈరోజు స్నానం, దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పుకున్నాం కదా.. మరి మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి..
గ్రహదోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం చదవాల్సిన శ్లోకం
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
చంద్రుడు
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||
బుధుడు
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||
శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
రాహు
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||
కేతు
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||