NDTV Open Offer Update: 2022 నవంబరు 22 నుంచి డిసెంబరు 5 మధ్య జరిగిన ఓపెన్ ఆఫర్‌లో, NDTV షేర్‌హోల్డర్ల నుంచి కొన్న షేర్లకు అదనంగా డబ్బు చెల్లించాలని అదానీ గ్రూప్ (Adani Group) నిర్ణయించింది. అప్పటి మార్కెట్ రేటు కంటే తక్కువ ధరను ఓపెన్ ఆఫర్‌లో ప్రకటించినప్పటికీ, 53 లక్షల షేర్లను విక్రయించేందుకు షేర్‌హోల్డర్లు ఆసక్తి చూపారు.
గత ఏడాది, విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొన్న అదానీ గ్రూప్, దాని ద్వారా ఎన్‌డీటీవీలో 29.18% వాటాను చేజిక్కించుకుంది. ఆ తర్వాత, రెగ్యులేటరీ నిబంధన ప్రకారం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటాను మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. గత వారం... ఎన్‌డీటీపీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధిక రాయ్‌కి ఎన్‌డీటీవీలో ఉన్న 32.26 శాతం వాటా నుంచి మరో 27.76 శాతం వాటాను కూడా అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇందుకోసం, ఆ ఇద్దరికీ ఒక్కో షేరుకు రూ. 342.65 చెల్లించింది. మొత్తంగా, 27.76 శాతం వాటా కోసం రూ. 602 కోట్లు చెల్లించింది.
ఇక్కడే స్టోరీ మలుపు తిరిగింది
రెగ్యులేటరీ నిబంధన ప్రకారం... ఓపెన్ ఆఫర్ ప్రకటించిన తేదీ నుంచి 26 వారాల లోపు, ఓపెన్ ఆఫర్ ధర కంటే ఎక్కువ మొత్తం చెల్లించి, ఓపెన్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ ఇతరుల దగ్గర్నుంచి కొనుగోలు చేస్తే.. ఆ అధిక మొత్తాన్ని ఓపెన్ ఆఫర్‌లో షేర్లు విక్రయించిన అందరికీ చెల్లించాలి. ఓపెన్ ఆఫర్ ప్రకటించిన తేదీ నుంచి 26 వారాల లోపే... ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ నుంచి ఒక్కో షేరును రూ. 342.65 ధరకు అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఓపెన్ ఆఫర్ ధర రూ. 294 కంటే ఇది రూ. 48.65 ఎక్కువ. కాబట్టి, ఓపెన్ ఆఫర్‌లో షేర్లు విక్రయించిన వారికి ఒక్కో షేరుపై రూ. 48.65ను అదానీ గ్రూప్ అదనంగా చెల్లించాలని నిర్ణయించింది. ఫైనల్‌గా, ప్రణయ్ రాయ్, రాధిక రాయ్‌కి ఒక్కో షేరు ధరకు దక్కిన రూ. 342.65 ధరే, ఓపెన్ ఆఫర్‌లో షేర్లు ఇచ్చిన వాళ్లకు కూడా అందుతుంది.
ఒక్కో షేరుకు అదనపు చెల్లింపుల నిర్ణయం గురించి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలియజేసింది.
విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనడం ద్వారా ఎన్‌డీటీవీలో 29.18% వాటా కైవసం, ఓపెన్ ఆఫర్ ద్వారా 26 శాతం వాటా కొనుగోలు, ఆ తర్వాత ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ నుంచి మరో 27.76 శాతం వాటాను దక్కించుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌డీటీవీలో తన మొత్తం హోల్డింగ్ 64.71 శాతానికి పెంచుకుంది. ప్రణయ్ రాయ్, రాధిక రాయ్‌కి తలో 2.5 శాతం చొప్పున వాటా మిగిలింది. మేజర్ హోల్డింగ్‌తో ఎన్‌డీటీవీ మీద అదానీ గ్రూప్ నియంత్రణ సాధించడంతో, రాయ్ దంపతులు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు.
నిన్నటి (మంగళవారం 03 జనవరి 2023) ముగింపు రూ. 344.75 కంటే కాస్త ఎక్కువ ధరతో ఇవాళ (బుధవారం 04 జనవరి 2023) రూ. 348 దగ్గర ఎన్‌డీటీవీ షేర్లు ఓపెన్ అయ్యాయి. గత ఆరు నెలల్లోనే రెట్టింపు (102%) లాభపడ్డ ఈ షేర్లు, గత నెల రోజుల వ్యవధిలో 13% నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.