Jharkhand murder: పిల్లలు దేవుడితో సమానం అంటారు. కానీ, కొందరు దుర్మార్గులు చిన్న పిల్లలని చూడకుండా లైంగిక దాడులు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అభం శుభం తెలియని ఏడేళ్ల బాలుడిని కొందరు గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా చంపేశారు. చిన్నారిపై యాసిడ్​ పోసి, నాలుక కోసి, కళ్లు, పళ్లు పీకేశారు. అనంతరం మృతదేహాన్ని బాలుడి చిన్నాన్న ఇంటి వెనుక ఉన్న గోతిలో పడేశారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్​ రాష్ట్రంలో వెలుగుచూసింది. 


గోతిలో మృతదేహం..


ఝార్ఖండ్​లోని గర్వా జిల్లాలో ఏడేళ్ల బాలుడిని అతికిరాతకంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ చిన్నారిపై యాసిడ్​ పోసి, నాలుక కోసి, కళ్లు, పళ్లు పీకేసి అమానవీయంగా ప్రవర్తించారు. అనంతరం మృతదేహాన్ని బాలుడి చిన్నాన్న ఇంటి వెనుక మరుగుదొడ్డి కోసం తవ్విన గోతిలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని దండాయి పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. అవధేశ్​ సాహు కుమారుడైన సంతన్​ కుమార్(7) రెండు రోజుల క్రితం మిఠాయిలు కొనేందుకు స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు. ఆ తర్వాత చాలా సమయం అయినా అతడు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు.. చిన్నారి కోసం అనేక చోట్ల వెతికారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం.. స్థానికంగా ఉన్న చిన్నారులు పాఠశాలకు వెళ్తూ సంతన్​ కుమార్​ మృతదేహాన్ని గుర్తించారు. అవధేశ్​ సాహు తమ్ముడైన సురేశ్‌ సాహు ఇంటి వెనుక మరుగుదొడ్డి కోసం తవ్విన గుంతలో సంతన్‌ నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి గ్రామస్థులకు తెలిపారు. వెంటనే గ్రామంలో ఉన్నవారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు.


కుటుంబ కలహాలే కారణం...!


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంతన్​ కుమార్​ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శవపరీక్షలు పూర్తయ్యాక బాలుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిపై దుండగులు.. యాసిడ్​ పోసి, నాలుక కోసి, కళ్లు, పళ్లు పీకేసినట్లు వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగానే చిన్నారిని ఇంత దారుణంగా చంపి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏడాదిన్నర చిన్నారిని నీళ్ల బకెట్​లో ముంచి హత్య చేసిన అమానుష ఘటన కేరళ ఎర్నాకుళం జిల్లాలో వెలుగుచూసింది. ఓ హోటల్​ గదిలో బామ్మ ప్రియుడే చిన్నారిని చంపేశాడు.