‘‘సీఎం జగన్‌ను నేను జగ్గుభాయ్ అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఆయన ప్రజల డబ్బును దోచుకుంటున్నాడు’’ అని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. జగన్ సంక్షేమ పథకాలు 70-30 మోడల్ లో ఉన్నాయని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఓల్డేజ్ పెన్షన్ సహా ఏ పథకం కూడా జగన్ కొత్తది అమలు చేయట్లేదని.. అవి ఎప్పటి నుంచో అమలు జరుగుతున్నవేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వకుండా సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. అంతకుముందు విద్యార్థులకు వచ్చే ఫీజు రీఎంబర్స్ మెంట్ స్థానంలో అమ్మ ఒడి ఇస్తున్నారని అన్నారు. వారాహి విజయయాత్ర రెండో విడతలో భాగంగా పవన్ కల్యాణ్ శుక్రవారం (జూలై 14) తణుకులో మాట్లాడారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని చెప్పి దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. డిజిటల్ దొంగల తరహాలో సీఎం జగన్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ దొంగిలించిన దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగ్ ఈ విషయాన్ని గుర్తించగా, అప్పుడు వాటిని మళ్లీ అకౌంట్లో వేుశారని అన్నారు. జగన్ ను తాను జగ్గూభాయ్ అనడం వైసీపీ నాయకులకు నచ్చట్లేదని అన్నారు.
నువ్వు కొంపలు అంటిస్తావు, నేను గుండెలు అంటిస్తా
ఆలయాలపై దాడులు
‘‘సీఎం జగన్ హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయి. విగ్రహాల ధ్వంసం చేశారు. ఆ ఘటనల్లో నమోదైన కేసుల్లో కారకులను ఇప్పటి దాకా పట్టుకోలేదు. ఆఖరికి అన్నవరంలో పురోహితులను వేలానికి పెట్టారు. పురోహితులను వేలం పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయం మీకు తెలుసా? వేలం వేయడం అనేది హిందూ ధర్మానికేనా? ఇతర మతాలకు అలాగే చేస్తారా? ఇతర మతాల విషయంలో చేయగలరా? అన్ని మతాలకు సమన్యాయం ఉండాలని రాజ్యాంగంలో ఉంది’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.
తణుకుకు చెందిన జనసేన నేత విడివాడ రామచంద్రరావుకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. పార్టీ కోసం నిలబడే మీ లాంటి నాయకుడికి గత ఎన్నికల సమయంలో తాను అండగా నిలబడనందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. తాను టికెట్ ఇచ్చిన వ్యక్తి మాత్రం పార్టీ నుంచి వెళ్లిపోయాడని అన్నారు.