Minister Harish Rao: కాంగ్రెస్ నేతలు నేరుగా వెళ్లి కరెంటు తీగల్ని పట్టుకుంటే.. రాష్ట్రంలో కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందని మంత్రి హరీష్ రావు కామెంట్లు చేశారు. గతంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉందో, మరోసారి అధికారంలోకి వస్తే పాత తరహా పాలన తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పకనే చెబుతున్నారని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పై ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 గంటలు సరిపోతుందని ఒకరు అంటే, 8 గంటలు చాలని మరొకరి చెబుతున్నారని వివరించారు. అలాగే బోరు బావుల వద్ద మీటర్ల పెడతామని మరొకరు మాట్లాడుతున్నారని తెలిపారు. ఇలాంటి మాటలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటుందని.. రైతుల పట్ల హస్తం పట్ల కాంగ్రెస్ విధానం ఏంటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతల తీరుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 






బషీర్ బాగ్ కాల్పులకు సీఎం కేసీఆర్ కారణం అని అంటున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇంతకంటే పెద్ద జోక్ మరోటి ఉండదని.. తెలంగాణ ఉద్యమానికి దారి తీసిన కారణాలలో విద్యుత్ కూడా ఒకటి అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతంగా విద్యుత్ బిల్లులు పెంచితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఒక్క కేసీఆర్ మాత్రేనని వివరించారు. బషీర్ బాగ్ కాల్పులు 2000వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీన జరిగాయని.. ఆ సమయంలో ప్రభుత్వంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారని గుర్తు చేశఆరు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని అదే రోజు చంద్రబాబుకు సీఎం కేసీఆర్ లేఖ రాశారని పేర్కొన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని... ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం సహించబోదని చెప్పారు. 






డిప్యూటీ స్పీకర్, కేంద్రమంత్రి పదవులను గడ్డిపోచలా వదిలేసిన నేత కేసీఆర్ అని.. పదవుల కోసం చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారేవారు మీరంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని.. లాగ్ బుక్కులు, పేపర్లు అంటూ ఏవేవో అంటున్నారని తెలిపారు. ఇదంతా మాట్లాడే బదులు.. కాంగ్రెస్ నేతలంతా వెళ్లి నేరుగా కెరంటు తీగలు పట్టుకుంటే విద్యుత్ వస్తుందో లేదో తెలుస్తుందన్నారు.