RBI Savings Bond: 


బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీరేటు కావాలా? ఏడేళ్ల వరకు డబ్బులు చేతికి అందకున్నా ఫర్వాలేదా? ప్రతి ఆరు నెలలకు వడ్డీ అందుకోవాలా? ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారా? అయితే ఇది మీకోసమే!


ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్స్‌!


ఆర్బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్‌ (FRSB)లో పెట్టుబడి పెడితే మెరుగైన రిటర్న్‌ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. 2020లో వీటిని ఆవిష్కరించినప్పటి నుంచి ఇవి వరుసగా 8 శాతం వరకు వడ్డీరేటు అందించాయి. ప్రస్తుతం 8.05 శాతం వరకు వడ్డీ వస్తోంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ వంటి బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా అధికంగా రిటర్న్‌ ఇస్తోంది. అయితే ఇక్కడే మీరో కీలక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఈ బాండ్లపై వడ్డీ స్థిరంగా ఉండదు.


ఎన్‌ఎస్‌ఈ కన్నా ఎక్కువ వడ్డీ!


చిన్న మొత్తాల పొదుపు పథకమైన నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (NSC)కి ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్‌ (FRSB) అనుసంధానమై ఉంటుంది. దీనికి 0.35 శాతం కలిపి వడ్డీరేటును ప్రకటిస్తారు. 2023 జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎన్‌ఎస్‌సీపై 7.7 శాతం వడ్డీ వస్తోంది. దీనికి 0.35 శాతం కలిపితే 8.1 శాతం అవుతుంది. ప్రతి ఆరు నెలలకు బాండ్‌ వడ్డీరేటును (Interest Rate) సవరిస్తుంటారు. తర్వాతి తేదీ 2023, జనవరి ఒకటి. అప్పటికి ఎన్‌ఎస్‌సీపై వడ్డీరేటు పెరిగితే ఇంకా బాండ్‌పై ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. తగ్గితే బాండ్‌ రిటర్న్‌ తగ్గుతుంది. ఏటా జనవరి, జులై ఒకటి తేదీల్లో బాండ్‌ వడ్డీ ఇస్తారు.


బ్యాంకు ఎఫ్‌డీలను మించి!


ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (Bank Fds) 6.5 నుంచి 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్నారు. ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్‌ 7.5 శాతం, మంత్లీ ఇన్‌కం స్కీమ్‌ 7.4 శాతం, ఎన్‌ఎస్‌సీపై 7.7 శాతం వరకు వడ్డీ ఇస్తున్నారు. వీటన్నిటితో పోలిస్తే ఆర్బీఐ (RBI) బాండ్‌పైనే ఎక్కువ గిట్టుబాటు అవుతోంది. ఆర్బీఐ ఫ్లోటింగ్‌ బాండ్లను కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీటికి ఏడేళ్ల వరకు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లు మాత్రమే పెనాల్టీతో ముందుగా విత్‌డ్రా చేసుకోగలరు. 60-70 ఏళ్ల వారికి ఆరు, 70-80 ఏళ్ల వారికి ఐదు, 80 ఏళ్ల పైబడిన వారికి నాలుగేళ్లు లాకిన్‌ ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1000. గరిష్ఠంగా ఎంతైనా పెట్టొచ్చు.


టాక్స్‌ ఫ్రీ కాదు!


ఆర్బీఐ బాండ్లపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అధిక వడ్డీరేటు వస్తున్నప్పటికీ ఏడేళ్లలో ఏమైనా జరగొచ్చు. ప్రభుత్వం వడ్డీరేట్లు పెంచితే ఎక్కువ మొత్తం చేతికొస్తుంది. తగ్గిస్తే తక్కువ వస్తుంది. రిజర్వు బ్యాంకు త్వరలోనే రెపోరేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే బ్యాంకు ఎఫ్‌డీలతో (FDs) పోలిస్తే నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లపై సాధారణంగా ఎక్కువ వడ్డీరేటే ఉంటుంది. అలాంటప్పుడు బ్యాంకులు ఇచ్చే దానికన్నా ఎక్కువే గిట్టుబాటు అవుతుంది. ఏడేళ్లు వేచిచూసే ఓపిక ఉన్నవాళ్లు, పోస్టాఫీస్‌ మంత్లీ స్కీమ్‌ (Post Office Monthly Scheme) ముగిసిన వారు, ఆరు నెలలకు వడ్డీ తీసుకోవాలని అనుకునేవాళ్లు, వయో వృద్ధులకు ఆర్బీఐ బాండ్లు (RBI bonds) మంచి ఆప్షన్‌ అని విశ్లేషకులు చెబుతున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial