Hyderabad News : అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా పసి పిల్లల అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. సంతానం లేని తల్లిదండ్రులు లక్షలకు లక్షలు కుమ్మరించి కొంటున్నారు. అభంశుభం ఎరుగని చిన్నారులకు వెల కడుతున్నారు. ముక్కుపచ్చలారని పిల్లలను అంగట్లో సరుకులాగా కొంటున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను పెంచే స్థోమత లేకనో లేక కాసులకు కక్కుర్తి పడో  బిడ్డలను అమ్ముకుంటున్నారు. ఇటీవల కాలంలో బిడ్డల అమ్మకాలకు దళారులు కూడా ఏర్పడి లక్షలకు లక్షలు సంపాదించుకుంటున్నారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు కాసుల ఆశ చూపించి నెలల రోజుల పిల్లలను కొనుగోలు చేస్తున్నారు.  ఒకరి నుంచి మరొకరికి బిడ్డలను చేతులు మారుస్తు కాసులు సంపాదిస్తున్నారు.  అలా కొనుగోలు చేసిన పిల్లలను కఠిన జీవితానికి బలి చేస్తున్నారు.


16 మంది చిన్నారుల్ని కాపాడిన రాచకొండ పోలీసులు 
 రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పిల్లల విక్రయాల ఘటన సంచలనం రేపుతోంది. పిల్లలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. రక్షించిన చిన్నారుల్లో తెలంగాణకు చెందిన వారే కాకుండా పొరుగు రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా మేడిపల్లిలో పసికందు విక్రయంతో ఈ ముఠా ఆగడాలు బయటపడ్డాయి. మొత్తం 16 మంది పసి బిడ్డలను ఈ ముఠా విక్రయించినట్లు గుర్తించారు. ఫిర్జాదిగూడలో  4.5 లక్షల రూపాయలకు చిన్నారిని ఆర్ఎంపీ శోభారాణి విక్రయించారు. ఆర్ఎంపీ, ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.




గత కొంత కాలంగా హైదరాబాద్ శివారులో పసి పిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా చిన్నారుల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చి  పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఒక్కో పిల్లాడిని దాదాపు లక్ష నుంచి రూ. 5 లక్షల నగదుకు ఈ ముఠా విక్రయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ఈ ముఠా ఆగడాలపై పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ముఠాను అదుపులోకి తీసుకున్నారు.   అరెస్ట్ అయిన వారిలో  ఓ తల్లీకొడుకుతో పాటు ఇద్దరు ముఠా సభ్యులు ఉన్నారు. మరోవైపు పిల్లలను కొన్న పేరెంట్స్ పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.


 పిర్జాదిగూడ రామకృష్ణ నగర్‌లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా మూడు నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. 16 మంది చిన్నారులను ట్రేస్ చేసి పోలీసులు వారిని కాపాడారు. ఇప్పటి వరకు మొత్తం 50 మందిని అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. అక్షర జ్యోతి ఫౌండేషన్ స్టింగ్‌ ఆపరేషన్‌లో ఈ అవాక్కయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిని పోషించడం మీకు భారమంటూ తల్లులకు చెప్పి.. మానవత్వంతో పిల్లలు లేనివారికి దత్తత ఇస్తామంటూ నమ్మించి విక్రయాలు చేస్తున్నారు.


పోలీసులు పేర్కొన్న నిందితులు.. 
A1  శోభారాణి,  
A2 హేమలత అలియాస్ స్వప్న, 
A3 షేక్ సలీమ్ 
A4 బండారి హరి హర చేతన్ 
A5 బండారి పద్మ  
A6 బలగం సరోజ 
A7 ముదావత్ శారద 
A8 ముదావత్ రాజు 
A9 పఠాన్ ముంతాజ్  
A10 జగనాదం అనురాధ 
A-11 యాత మమత