Baahubali Fame Kattappa: ఈరోజుల్లో తెలుగు నటీనటులకు దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ లభిస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ యాక్టర్లు బాలీవుడ్‌లో నటించడం కష్టమని చెప్తుండేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ వారే పిలిచి మరీ సౌత్ యాక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుకు కూడా బాలీవుడ్‌లో ఒక స్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించే ఛాన్స్ లభించింది. ఆయన మరెవరో కాదు సత్యరాజ్. సత్యరాజ్ అని చెప్పడంకంటే ‘బాహుబలి’లో కట్టప్ప అని చెప్తే ఈ నటుడిని ఎక్కువమంది ప్రేక్షకులు గుర్తుపడతారు. త్వరలోనే సత్యరాజ్.. ఆయన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.


ముందుగానే అప్డేట్స్..


తమిళ దర్శకుడు మురుగదాస్.. చాలాకాలం తర్వాత ఒక హిందీ సినిమాను డైరెక్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఎంతోకాలంగా సల్మాన్ ఖాన్‌తో మూవీ చేయాలని సన్నాహాలు చేస్తున్న మురుగదాస్‌కు ఫైనల్‌గా అవకాశం దక్కింది. కొన్నిరోజుల క్రితమే మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వకముందే టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. మురుగదాస్, సల్మాన్ ఖాన్ మొదటిసారి కలిసి చేస్తున్న సినిమాకు ‘సికందర్’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీలో సత్యరాజ్.. విలన్‌గా నటిస్తున్నాడనే వార్త అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది.


‘బాహుబలి’తో గుర్తింపు..


సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘సికందర్’లో రష్మిక మందనాను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ఇప్పుడు విలన్‌గా సత్యరాజ్ రంగంలోకి దిగనున్నారు. సత్యరాజ్ కీలక పాత్ర పోషించిన ‘బాహుబలి’ సినిమా కేవలం తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా రికార్డులను సృష్టించింది. అంతే కాకుండా ఈ మూవీ మొదటిసారి ఎన్నో ఒరిజినల్ హిందీ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. అందులో హీరోగా నటించిన ప్రభాస్‌తో పాటు అందరు నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. అందులో సత్యరాజ్ కూడా ఒకరు. ఇక ఆ మూవీ వచ్చిన ఇన్నాళ్లకు సత్యరాజ్‌కు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ సినిమాలో విలన్‌గా అవకాశం రావడం విశేషం.


ఇన్నేళ్ల తర్వాత ఖాన్ సినిమాలో..


సత్యరాజ్.. ఇంతకు ముందు కూడా పలు హిందీ చిత్రాల్లో నటించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె తండ్రి పాత్రలో కనిపించారు సత్యరాజ్. అప్పుడే ఒక తమిళ విలన్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మళ్లీ ఇంతకాలం తర్వాత ఒక ఖాన్‌లో నటించే అవకాశం దక్కించుకున్నారు సత్యరాజ్. అంతే కాకుండా ప్రస్తుతం ఈ నటుడి చేతిలో మరెన్నో భారీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. షర్వరి వాఘ్ లీడ్ రోల్ చేస్తున్న ‘ముంజ్య’ సినిమాలో కూడా సత్యరాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆయన బిజీగా ఉన్నారు. తెలుగులో మాత్రం సత్యరాజ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.


Also Read: పిన్ని మహేశ్వరితో జాన్వీ కపూర్ - చెన్నైలో శ్రీదేవికి ఇష్టమైన గుడిలో దర్శనం