Telangana Government changes to State Emblem | హైదరాబాద్: తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గేయంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టగా, తాజాగా రాష్ట్ర రాజముద్రపై సైతం మార్పులు చేపడుతుండటంతో మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉందంటూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ రూపొందించిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా- జమునా తహజీబుకి ప్రతీకలుగా కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం.. రాచరిక పోకడనట అంటూ అసహనం వ్యక్తం చేశారు. 


రాష్ట్ర గీతంలో మాత్రం రాజముద్రలో ఉన్న చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి ! అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని, ఆయన మంత్రి వర్గంలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ? అని సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.






కేటీఆర్ మరో ట్వీట్‌ ఇలా.. 
ఇదేం రెండునాల్కల వైఖరి..! ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన అంటూనే  కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం.. చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు అని కేటీఆర్ ప్రశ్నించారు. అవి రాచరికపు గుర్తులు కాదు.. వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని, వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని కేటీఆర్ పేర్కొన్నారు. 


కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప 
జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అని, గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే ఈ చార్మినార్ చిహ్నం. అధికారిక గీతంలో కీర్తించి.. అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..? రెండు నాల్కల ధోరణి ఏంటని ప్రశ్నించారు. చార్మినార్ అంటే ఒక కట్టడం కాదు.. విశ్వనగరం హైదరాబాద్ కు ఐకాన్ అన్నారు. కాకతీయ కళాతోరణం అంటే ఒక నిర్మాణం కాదు.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం కానీ.. వాటిని రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే అని, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే అని కేటీఆర్ రాసుకొచ్చారు.


కర్ణాటకలో కూడా మార్చుతారా? 
కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులు ఉంటే.. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగిస్తుందా చెప్పండి. భారత జాతీయ చిహ్నంలో అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన 3 సింహాలు ఉన్నాయి.. జాతీయ పతాకంలో ధర్మచక్రం ఉందని, వాటిని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ? అసెంబ్లీని కూల్చేస్తారా ? నేడు తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు.. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా అని ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ చేశారు.


గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ రాష్ట్ర ప్రజల ఆమోదం ఉంది. సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకం సైతం ఉందన్నారు. కానీ నేడు రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో తెలంగాణ అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. ఓరుగల్లు సాక్షిగా... మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరించి, తెలంగాణ ప్రజల్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.