Punjab Crime News: కన్నకూతురు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరుసటి రోజే తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే కూతురికి ఎవరితోనే సంబంధం ఉందని అనుమానం, కోపం పెంచుకున్న తండ్రి ఆమెను దారుణంగా కొట్టి చంపేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని తాడుతో బైక్ కు కట్టి ఊరేగించాడు. 


అసలేం జరిగిందంటే..?


పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన దల్బీర్ సింగ్ ఒక కూలీ. బుధవారం రోజు అతడి 20 ఏళ్ల కూతురు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. మరుసటి రోజు తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే దల్బీర్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఎవరితోనే సంబంధం ఉందనుకొని భావించి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ కోపంతోనే ఆమెపై దాడి చేశాడు. కుటుంబ సభ్యులు అందరూ ఎంతగా ఆపే ప్రయత్నం చేసినా అతడు ఆగలేదు. ఓ గదిలోకి తీసుకెళ్లి మరీ ఆమెను విపరీతంగా కొట్టడంతో కూతురు అక్కడికక్కడే చనిపోయింది. కూతురు చనిపోయినా అతడి కోపం చల్లారలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని తన ద్విచక్రవాహనానికి కట్టి ఈడ్చుకెళ్లాడు. ఊరంతా తప్పి ఆపై దగ్గర్లోని రైలు పట్టాలపై పడేశాడు.


వీడియోలు వైరల్..


అయితే ఆమెపై దాడి చేస్తుండగా.. స్థానికులు వీడియోలు, ఫొటోలు తీశారు. ముఖ్యంగా మృతదేహాన్ని గ్రామంలో తిప్పుతుండగా.. తీసిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దల్బీర్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Read Also: Anantapur Road Accident: ప్రాణాలు పోతున్నా భార్యకు ధైర్యం చెప్పిన భర్త- సాయం చేయడానికి రాని చుట్టుపక్కల జనం


ఇటీవలే కూతురు కళ్లెదుటే భార్యను చంపిన భర్త


హైదరాబాద్ లోని చందానగర్ లో నివాసం ఉంటున్న 27 ఏళ్ల అంబికకు గతంలోనే సురేందర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టింది. కానీ గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. దీంతో భార్య అంబిక.. భర్తకు దూరంగా వచ్చేసింది. వేరే ఇంట్లో ఉంటూ కూతురితో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే బతుకు దెరువు కోసం నల్లగండ్ల బాటా షోరూం పైన ఉన్న శ్వాస బోటిక్ లో పని చేస్తోంది. అయితే భార్య అంబికపై విపరీతమైన కోపం పెంచుకున్న సురేందర్ ఆమెను ఎలాగైనా సరే చంపేయాలనుకున్నాడు. ఈరోజు కత్తి తీసుకొని ఆమె పని చేస్తున్న చోటుకు వచ్చాడు. అంతా చూస్తుండగా.. పట్టపగలే కత్తితో ఆమె పీక కోశాడు. తీవ్ర గాయాలపాలైన అంబిక అక్కడికక్కడే మరణించింది. అదే సమయంలో వారి కూతురు కూడా అక్కడే ఉంది. కళ్లెదుటే తండ్రి.. తన అమ్మను చంపడం చూసిన చిన్నారి భయంతో గజగజా వణికిపోతోంది. 


అయితే స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాపను కూడా పోలీసులు వారి వెంటే తీసుకెళ్లారు. అంబిక బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే భార్య అంబిక మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతోనే భర్త సురేందర్ ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. అలాగే నిందితుడు సురేందర్ కోసం గాలిస్తున్నామని చందానగర్ పోలీసులు వివరించారు.