Anantapur Road Accident: రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు చిద్రమైపోయాయి. తీవ్ర రక్తస్రావంతో ఒంట్లో నిస్సత్తువ ఆవహించింది. బైర్లు కమ్ముతున్న కళ్లు.. మరికొద్ది సేపట్లోనే మరణం తనని కబలిస్తోందని అతనికి తెలిసిపోయిందేమో... బాధని పంటి బిగువున భరిస్తూ ఆ పక్కనే నిస్తేజంగా పడిపోయిన తన భార్యను గుండెలకు హత్తుకుని ఆమెలో ధైర్యాన్ని నూరిపోస్తూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కంటతడి పెడుతున్న దృశ్యం అక్కడివారి కళ్లు చమర్చేలా చేసింది. అనంతపురం పట్టణంలోని తపోవనం సర్కిల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత క్షతగాత్రులైన దంపతులు ఇద్దరూ పరస్పరం ధైర్యం చెప్పుకున్నప్పటి దృశ్యాలు అందరి హృదయాలను ద్రవిభవింపజేశాయి.


ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ తన భార్య అనితను బస్ స్టాప్ వద్ద డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా తపోవనం సర్కిల్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ స్కిడ్ అయి పడిపోగానే అటుగా వస్తున్న లారీ వారి మీద నుంచి వెళ్లడంతో కిరణ్ కు రెండు కాళ్లు చిద్రం అయిపోయాయి. ఆయన భార్య అనితకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆంబులెన్సుకి సమాచారం ఇచ్చినప్పటికీ.. సుమారు 15 నిమిషాల వరకు అంబులెన్స్ అక్కడికి చేరలేదు. ఈలోగా తన అవయవాలు పూర్తిగా చిద్రమైపోయినప్పటికీ, రక్తం కారుతున్నా లెక్కచేయకుండా అపస్మారక స్థితిలో ఉన్న భార్య వద్దకు డోకుతూ వెళ్లి ఆమెను గుండెలకు హత్తుకుని కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని కర్తవ్య బోధ చేశారు. చివరి శ్వాసలోనూ భార్య చేయి విడవకుండా ధైర్యం చెప్పిన కిరణ్ ప్రస్తుతం ప్రాణాలతో లేరు. చికిత్స పొందుతూ ఆయన మృత్యువాత పడ్డారు. ఆయన భార్య సైతం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఏది ఏమైనా కడదాకా తోడుంటానని పెళ్లి పీటలపై చేసిన ప్రమాణాల మీద కిరణ్ చివరి శ్వాస వరకు నిలబడడం ఎంతోమందికి ఆదర్శం.


మనుషుల్లో మానవత్వం కలిసిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ


కానీ మనుషుల్లో మానవత్వం మంట కలిసిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. రోడ్డు ప్రమాదంలో తీవ్రగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న కానిస్టేబుల్ దంపతులను జనం గుమికూడి ఫొటోలు, వీడియోలు తీస్తూ.. చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ కాపాడేందుకు ముందుకు రాలేదు. కనీసం నీళ్లైనా ఇవ్వలేదు. ఒక్కరు కూడా దగ్గరకు వెళ్లలేదు. అంబులెన్సుకు ఫోన్ చేసి అక్కడే చూస్తూ నిలబడి ఉండిపోయారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చే వరకు వారికి కనీస సపర్యలు చేయకపోవడం మరీ దారుణం. 


ఆత్మకూరుకు చెందిన 42 ఏళ్ల కిరణ్ కుమార్ రెడ్డి ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎంపికై గ్రే హౌండ్స్ లో పని చేశారు. 2014లో ఏపీఎస్ప నుంచి ఏఆర్ కానిస్టేబుల్ గా కన్వర్షన్ తీసుకున్నారు. అప్పటి నుంచి జిల్లా కేంద్రంలోనే విధులు నిర్వహిస్తున్నారు. భార్య అనిత శింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పని చేస్తున్నారు. వారికి యశ్వంత్ నారాయణ, మణిదీప్ కుమారులు ఉన్నారు. ఇటీవలే నగరంలోని కల్యాణదుర్గం రోడడులో ఉన్న ఎస్బీఐ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. కిరణ్ కుమార్ రోజూ భార్యను వాహనంలో సోమలదొడ్డి క్రాస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చేవారు. ఈక్రమంలోనే బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది.