మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bhola Shankar). మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇందులో చిరు సరసన తమన్నా భాటియా కథానాయికగా నటించారు. చిరు సోదరిగా కీర్తీ సురేష్, ఆమెకు జోడీగా సుశాంత్ కనిపించనున్నారు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాళం' స్ఫూర్తితో తీసిన చిత్రమిది. తెలుగులో చిరంజీవి ఇమేజ్, ఆయన నుంచి అభిమానులు ఆశించే అంశాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశామని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు 'భోళా శంకర్' చిత్రాన్ని భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో షోలు పడుతున్నాయి. ఆల్రెడీ అమెరికాతో పాటు మరికొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో షోలు పడ్డాయి. అక్కడి టాక్ ఎలా ఉంది? సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అని చూస్తే...
'ఖుషి' నడుము సీన్... థియేటర్లలో అరుపులే!
తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని తొలిసారి చిరంజీవి ఇమిటేట్ చేశారు. 'భోళా శంకర్'లో పవన్ తరహాలో చిరంజీవి చేసిన సీన్ అభిమానులను అలరిస్తుందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. ఇక, శ్రీముఖితో చిరు చేసిన 'ఖుషి' నడుము సీన్ స్పూఫ్ వచ్చిన సమయంలో థియేటర్లలో అరుపులు, కేకలే వినిపించాయి.
Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ఏవరేజ్ టు అబౌవ్ ఏవరేజ్!?
Bhola Shankar Review USA : 'భోళా శంకర్' సినిమా ఏవరేజ్ టు అబౌవ్ ఏవరేజ్ అని చాలా మంది ట్వీట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ తమకు సినిమా నచ్చిందని. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కీర్తీ సురేష్ (Keerthy Suresh)ను తీసుకు వెళుతూ చిరంజీవి ఇచ్చే మాస్ వార్నింగ్ సీన్ అద్భుతమని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఎమోషనల్ సీన్లలో చిరంజీవి యాక్టింగ్ గురించి ఓ అభిమాని ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
Bhola Shankar Twitter Review : 'భోళా శంకర్'కు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ ఎలా అయితే ఉందో... కొంత మంది ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ కూడా ఉంది. 'భోళా శంకర్'కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసి, 'వేదాళం' రీమేక్ అని తెలిసి బుర్ర ఇంట్లో పెట్టి వెళ్లినా నచ్చలేదని ఒకరు ట్వీట్ చేశారు. రెండు యాక్షన్ సీన్లు, ఓ కామెడీ సీన్ తప్ప సినిమాలో ఏమీ లేదని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య ట్వీట్స్ యుద్ధానికి 'భోళా శంకర్' దారి తీసిందని చెప్పవచ్చు.
Also Read : సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు - చిరంజీవికి విజయసాయి కౌంటర్, ఏకిపారేస్తున్న నెటిజన్లు
ఆగని మెహర్ రమేష్ ట్రోల్స్
మెహర్ రమేష్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ వస్తున్నాయి. 'శక్తి', 'షాడో' తీసిన దర్శకుడి నుంచి ఇంతకు మించి ఏం ఆశిస్తామని, ఆయన రాడ్ సినిమా తీశారని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 'ఖుషి' నడుము సీన్ తీసిన విధానంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గమనిక : సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను ఇక్కడ యథాతథంగా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు ఏబీపీ దేశం సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ప్రజల స్పందన తెలియజేయడం మాత్రమే ఈ కథనం ఉద్దేశం.