సినీ పరిశ్రమ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ పెద్దల విమర్శల దాడి కొనసాగుతూ ఉంది. వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుకల సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి వ్యాఖ్యలు చేశారంటూ మంత్రులు వరుసగా స్పందించి మెగాస్టార్ కు దీటైన కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ, చిరంజీవి.. ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఫుల్ వీడియోను వారు నిన్న (ఆగస్టు 10) విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారం విజయసాయి రెడ్డి వైపు మళ్లింది. దీంతో విజయసాయి రెడ్డి చిరంజీవికి కౌంటర్లు వేశారు.
‘‘సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ....లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఏకిపారేస్తున్న నెటిజన్లు
‘‘మా బాగా చెప్పారు. Mr. A2 గారు మీ పని మర్చిపోతున్నారు ఇలాంటి బోల్లు మాటలతో ప్రజలని ప్రక్క దారి మళ్లిస్తున్నారు మీ పని మీరు చెయ్యండి. ఉపాధి అవకాశాలు లేవు మీ వల్ల గల్ఫ్ లో ఎండలో మాడిపోవలసి వస్తుంది’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మీరు జీతాలు తగ్గించుకున్నారా? రాష్ట్రంలో ఎంతోమంది పేదవారు ఉన్నారుగా? అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.