చట్టాల్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తానే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వీరు చట్టాల్ని ఉల్లంఘించొచ్చు కానీ, ఇతరులు శాంతియుత నిరసనలు తెలిపితే సహించలేరని అన్నారు. పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని రుషికొండను సందర్శించారు. ఆయన వెంట జనసేన కార్యకర్తలే కాకుండా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయన వెంట వెళ్లారు. రుషికొండను బయటి నుంచే పరిశీలించిన పవన్ కల్యాణ్ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రుషికొండ లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో ఎదురుగా ఉన్న రోడ్డు పైనుంచే వాహనం ఎక్కి రుషికొండ వద్ద తవ్వకాలను, నిర్మాణాలను పవన్ కల్యాణ్ పరిశీలించారు.


ఈ రుషికొండ అనే కొండ దాని వెనక ఉన్న గ్రామాన్ని తుపాన్లు లాంటి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతూ ఉందని, అలాంటి కొండను నాశనం చేస్తున్నారని విమర్శించారు. గతంలో తెలంగాణను కూడా వీళ్లు ఇలాగే దోపిడీ చేశారని, అందుకే అక్కడి నుంచి తన్ని తగలేశారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైఎస్ఆర్ సీపీ నేతల కళ్లు పడ్డాయని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని పవన్ విమర్శించారు. సీఎం జగన్ ఉండేందుకు ఇంకా ఎన్ని ఇళ్లు కావాలని పవన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ నేతల దోపిడీ గురించి అందరికీ తెలియాలని, మీడియా కూడా దీనిపై చొరవ చూపాలని కోరారు.


పోలీసుల ఆంక్షల మధ్యే విశాఖపట్నంలో పవన్‌ కల్యాణ్‌ రుషికొండ పర్యటన సాగింది. రుషికొండ వద్దకు కాకుండా ఎదురుగా ఉన్న రోడ్డులోకి మాత్రమే వెళ్లాలని పోలీసులు సూచించారు. నగరంలోని జోడుగుళ్ల పాలెం, విశాలాక్షి నగర్‌, జూపార్కు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మూడు ఏరియాల్లో ఓ పోలీసు ఉన్నతాధికారులను నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే వాహనాలను నియంత్రించారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ రుషికొండకు వెళ్తుండగా, దారి పొడవునా ఆయన కార్యకర్తలు, అభిమానులు బైకులపై, ఇంకొంత మంది పరిగెత్తుకుంటూ పవన్ ను అనుసరించారు. పోన్లలో వీడియోలు తీసుకుంటూ ఉత్సాహం కనబర్చారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని నినాదాలు చేశారు.