Notice To Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్ కు నోటీసులు అందించారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై కేసులు ఏమైనా నమోదు చేశారా లేదా అన్నదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పవన్ ఏమన్నారంటే ?
లిక్కర్ అమ్మకాల ద్వారా సీఎం జగన్ 30 వేల కోట్లు సంపాదించారని జనసేన అధినేత ఆరోపించారు. గురువారం వైజాగ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ సొంత బ్రేవరేజస్ పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారని, వాటి ద్వారా ప్రజల ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సారా కొట్టు నుంచి సిమెంట్ పరిశ్రమ దాకా అన్నీ జగన్ కిందే ఉన్నాయన్నారు. రుషికొండ జగన్ దేనని, ఫేమా అనే సంస్థ జగన్ దేనని అన్నారు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదని, ఎవరు పచ్చగా ఉండకూడదని, ఎవరూ తెల్లదుస్తులు ధరించరాదనే మనస్తత్వం జగన్ సొంతమన్నారు. ప్రజలు బాగా పరిపాలించమని అధికారం ఇస్తే జగన్ మాత్రం ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఒక్క కులంతోనే పదవులు ఇస్తున్నారని, రూలింగ్ కాస్ట్ వ్యవస్థకు తాను వ్యతిరేకమని పవన్ అన్నారు. తాము పాలించడానికే ఉన్నామని జగన్ భావిస్తున్నారని, ఇతర కులాలు పాలించబడడానికే ఉన్నారనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారని పవన్ విమర్శించారు. అందుకు తాను, జనసేన వ్యతిరేకమన్నారు.
కీలకమైన పదవులు అన్నీ ఒకే కులానికి అప్పగిస్తున్నారని, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన వారు కులానికి కట్టుబడి ఉంటున్నారని అన్నారు. జనసేన అధికారం ఇస్తే అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తామన్నారు. జగన్ ఒక డెకాయిడ్, దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రజలకు తెలియకుండా ఏమీ ఉండకూడదని, కాగ్‌కు లెక్కలు చూపించకుండా వేల కోట్లు దోచేశారని విమర్శించారు.గ్రామ స్వరాజ్యం అంటే వలంటీర్లతో గ్రామాలను నింపడం కాదని, పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అన్నారు. రూ.4,500 కోట్లు పంచాయతీ నిధులు దారి మళ్లించారని, పంచాయతీలకు రావాల్సిన 1,191కోట్లను వలంటీర్లకు జీతాలుగా ఇచ్చారని ఆరోపించారు. పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి నిధులు లేవన్నారు. పంచాయతీల అభివృద్ధి, స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నానని అన్నారు. కేంద్రం నుంచి నేరుగా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేసేలా పెద్దలతో మాట్లాడతానన్నారు. గ్రామ సభలను బలోపేతం చేస్తామని చెప్పారు. సర్పంచ్‌లు నిధుల కోసం కోర్టులకు వెళ్లాలని జనసేన అండగా ఉంటుందన్నారు.
పవన్ పర్యటనపై ఆంక్షలు
మరో వైపు పవన్ కల్యాణ్ రుషికొడం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని జోడుగుళ్లపాలెం నుంచి పవన్ తో పాటు ఎనిమిది వాహనాలను మాత్రమే అనుమతించారు. జనసైనికుల్ని అనుమించేదిలేదని పోలీసులు ప్రకటించారు. హోటల్ నుంచి పవన్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్ వెళ్లనున్నారు. రుషికొండను రోడ్డుపై నుంచే పరిశీలించాల్సి ఉంది. రుషికొండ వైపు వెళ్లకుండా తనను అడ్డుకుంటే.. అక్కడే ధర్నా చేయాలని పవన్ అనుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు ఆ దారి గుండా పవన్ వాహనాలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు.