Parvatipuram News : పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో అజాగ్రత్తగా ప్రయాణిస్తున్న మహిళ తన చేయి కోల్పోయింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న పేలూరి పైడితల్లి ‌అనే మహిళ కిటికీలోంచి బైటకు చేయి పెట్టడంతో పక్క నుంచి వెళ్తున్న ఆటో ఆమె చేతిని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చేయి విరిగిపోయి రోడ్డుపై పడింది. వీరఘట్టం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో తోటి ప్రయాణికులు హడలెత్తిపోయారు. చికిత్స నిమిత్తం బాధితురాలిని పాలకొండ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.


డ్రైవర్ నిర్లక్ష్యం పాలు నేలపాలు 


మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ పాల ట్యాంకర్ అత్యంత వేగంగా వస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో డ్రైవర్ సత్యశిల్‌కి స్వల్పగాయాలయ్యాయి. 12,000 వేల లీటర్ల పాలు తీసుకుని మహారాష్ట్ర నుంచి ఉప్పల్‌కు వస్తున్న ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ట్యాంకర్‌లో ఉన్న పాలు అన్ని పూర్తిగా నేలపాలయ్యాయి. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకర్‌ను అడ్డు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.


వాటర్ స్లైడ్ మధ్యలో విరిగి ప్రమాదం


ఇండోనేషియాలోని కెంజెరన్ పార్క్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వాటర్ స్లైడ్‌లో జర్రున జారుతూ పూల్‌లోకి వెళ్లాల్సిన జనం.. ఇక్కసారిగా నేలపై పడ్డారు. వాటర్ స్లైడ్‌ మధ్యలోకి విరిగిపోవడంతో 30 అడుగుల ఎత్తు నుంచి అమాంతంగా కిందపడ్డారు. సుమారు 16 మంది ఒకరిపై ఒకరు పడ్డారు. వీరిలో ఎనిమిది మందిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు ఎముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పార్క్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆ స్లైడ్ వీక్‌గా ఉందని, ఒకరి కంటే ఎక్కువ మంది ఎక్కకూడదని హెచ్చరించినా ఎవరూ మాట వినలేదని తెలిపారు. అంతా ఒకేసారి స్లైడ్ చేయడం వల్ల ఓవర్ లోడ్ ఏర్పడి విరిగిపోయిందన్నారు. గత 9 నెలల నుంచి ఆ వాటర్ స్లైడ్‌కు మెయింటెనెన్స్ చేయడం లేదని డిప్యుటీ మేయర్ సురాబయా తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి పార్క్ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలిపారు. క్షతగాత్రులంతా పూర్తిగా కోలుకొనేవరకు చికిత్స ఖర్చులను నిర్వాహకులే భరించాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలే వేసవి కాలం. మీరు కూడా వాటర్ స్లైడ్స్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నట్లయితే.. తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించండి.