బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. వచ్చి రాగానే ఆయన అధికారిక పర్యటన లో భాగంగా నేషనల్ సైన్స్ లేబోరేటరీని సందర్శించారు.  ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరినీ ప్రారంభించారు.. తర్వాత పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వతా సభకు హాజరవుతారు. అమిత్ షా ప్రసంగం అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. అటు టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ తెలంగాణ అగ్రనేతలు అమిత్ షాకు ప్రశ్నల వర్షం కురిపించారు. సమాధానాలు చెప్పాలన్నారు.  బహిరంగసభా వేదిక నుంచి వాటికి అమిత్ షా రిప్లై ఇస్తారా లేదా అన్న ఆసక్తి ప్రారంభమయింది. 



27 ప్రశ్నలు సంధించిన కేటీఆర్ ! 


అమిత్‌షాకు  కేటీఆర్ 27 ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు.  తెలంగాణకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు బీజేపీ నెరవేర్చలేదని ఫైరయ్యారు.. బీజేపీ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. ఇరవై ఏడు ప్రశ్నలన్నీ.. కేంద్రం నుంచి తెలంగామకు రావాల్సిన ప్రాజెక్టులు.. ప్రయోజనాలు.. నిధులకు సంబంధించినవే. ప్రతిసారి వచ్చి స్పీచులు ఇచ్చి వెళ్లిపోవడం కేంద్ర నాయకులకు అలవాటుగా మారిందని ఈ సారి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. 



తెలంగాణకు రావాల్సినవాటిపై ప్రశ్నించిన కవిత ! 


ఇక కేటీఆర్ సోదరి.. ఎమ్మెల్సీ కవిత కూడా అమిత్ షాకు ప్రశ్నల వర్షం కురిపించారు.  తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావించారు.  ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు.  ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐడీ, మెడికల్ కాలేజీలు, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు. 



తొమ్మిది ప్రశ్నలు వేసిన రేవంత్ రెడ్డి ! 


టీఆర్ఎస్‌తో కలిసి తెలంగాణ ప్రజలకు ఇద్దరూ కలిసి చేసిన మోసంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవం పై మోదీ దాడి, రైతుకు అన్యాయం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా పెరుగుతున్న నిత్యావసరాల ధరలపై తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా మరో లేఖ రాశారు. 



వీటన్నింటికీ అమిత్ షా ఆన్సర్స్ ఇస్తారా ? 


అమిత్ షాకు ఇలా తెలంగాణ అగ్రనేతలందరి నుంచి ప్రశ్నలు వెళ్లాయి. ఈ ప్రశ్నలేనే ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియాలో సర్క్యూరేట్ చేస్తున్నారు. అమిత్ షాను ప్రశ్నిస్తూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టి వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తుక్కుగూడ సభలో వీటన్నింటిపై స్పందిస్తారా లేకపోతే లైట్ తీసుకుంటారా అన్నదానిపై అంతటా ఆసక్తి ఏర్పడింది.