Stock Market Weekly Review: భారత ఈక్విటీ మార్కెట్లు 2022, మే రెండో వారంలోనూ వరుసగా పతనం అయ్యాయి. బెంచ్‌ మార్క్‌ సూచీలు నేల చూపులు చూస్తుండటంతో ఇన్వెస్టర్లు భారీగా తమ సంపదను నష్టపోయారు. దాంతో వచ్చే వారం మార్కెట్లు ఎలా కదలాడతాయోనని ఆందోళన చెందుతున్నారు. క్యాష్ మార్కెట్లోనే కాకుండా డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు తీసుకున్న ట్రేడర్లూ డబ్బులు పోగొట్టుకున్నారు. మొత్తంగా ఈ వారం మార్కెట్లు 3.72 శాతం వరకు పతనం అయ్యాయి.


BSE Sensex


మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌  మే9న 54,835 వద్ద మొదలైంది. 54,856 వద్ద వారంతపు గరిష్ఠాన్ని అందుకున్నాయి. 52,657 వద్ద కనిష్ఠాన్ని తాకింది. మొత్తంగా 3.72 శాతం నష్టపోయి 52,793 వద్ద ముగిసింది. గత వారం ముగింపుతో పోలిస్తే దాదాపుగా 2042 పాయింట్లు పతనమైంది. అంటే ఇన్వెస్టర్లు రూ.10 లక్షల కోట్ల వరకు సంపదను నష్టపోయారు. మే తొలి వారం నష్టం 3.9 శాతానికి కలుపుకుంటే రెండు వారాల్లోనే 7.48 శాతం సూచీ పతనమైంది.


NSE Nifty


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పరిస్థితీ ఇలాగే ఉంది. మే 8న 16,242 వద్ద మొదలైన సూచీ 16,404 వద్ద వారాంతపు గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత అమ్మకాల సెగతో 15,737 వద్ద కనిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 15,782 వద్ద ముగిసింది. మొత్తంగా సూచీ 3.83 శాతం నష్టపోయింది. గతవారం నష్టం 3.04తో కలుపుకుంటే 7.72 శాతం వరకు పతనమైంది.


కారణాలు ఇవే


ఈ వారం మార్కెట్లు నష్టపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం మొదటిది. అమెరికాలో 40 ఏళ్ల గరిష్ఠానికి ఇది చేరుకుంది. ఇక భారత్‌లో ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ 7.79 శాతానికి పెరిగింది. ఆర్బీఐ లక్షిత ద్రవ్యోల్బణం 6 శాతాన్ని మించే నమోదైంది. అమెరికాలో వడ్డీరేట్లు పెరగడం, బాండు ఈల్డులు పెరగడం మరో కారణం. ఫారిన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌  ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇక రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం తాలుకు దుష్ఫలితాలను ప్రపంచం చూస్తూనే ఉంది. ముడి చమురు, వంట నూనె, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా పెరిగాయి. ఎకానమీ మందకొడిగా సాగుతోంది.