SBI Q4 Result: భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) శుక్రవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. స్టాండలోన్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.9,113 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలోని రూ.6,450 కోట్లతో పోలిస్తే 41.27 శాతం వృద్ధి నమోదు చేసింది. అయితే మార్కెట్ వర్గాలు అంచనా వేసిన రూ.10,000 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే కావడం గమనార్హం. కంపెనీ ఒక్కో షేరుకు రూ.7.10 డివిడెండ్‌ను ఆమోదించింది. 2022, మే 26ను రికార్డు డేట్‌గా ప్రకటించింది.
ప్రస్తుత త్రైమాసికంలో ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం రూ.31,198 కోట్లుగా ఉంది. విశ్లేషకులు అంచనా వేసిన రూ.31,800 కోట్ల కన్నా కొంత తక్కువగా నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.27,067తో పోలిస్తే 15.26 శాతం వృద్ధి చెందడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే మొండి బకాయిలకు కేటాయించిన ప్రావిజన్స్ మూడో వంతుకు తగ్గించామని కంపెనీ వెల్లడించింది. అంతకు ముందు రూ.9,914 కోట్లతో పోలిస్తే ఈ సారి కేవలం రూ.3,262 కోట్లు మాత్రమే కేటాయించామని పేర్కొంది. అయితే మొండి బకాయిలు సహా మొత్తం కంటిజెన్సీస్‌కు రూ.7,237 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. అంతకు ముందు ఇవి రూ.11,051 కోట్లు కావడం గమనార్హం.
మొత్తం ఆస్తుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (NPAs) 4.50 శాతం నుంచి 3.97 శాతానికి తగ్గిపోయాయి. గతేడాది ఇది 4.98 శాతం కావడం గమనార్హం. నికర ఎన్‌పీఏ 1.50 శాతం నుంచి 1.34, ఇప్పుడు 1.02 శాతానికి తగ్గాయి. బేసెల్ త్రీ క్యాపిటల్ అడిక్వసీ రేషియో (CAR) గతేడాది 13.74 శాతం ఉండగా డిసెంబర్లో 13.23, తాజాగా 13.83 శాతానికి మెరుగైందని ఎస్‌బీఐ వెల్లడించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.