Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) వరుసగా ఆరో సెషన్లో నష్టపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు ఉన్నప్పటికీ, బాండ్‌ యీల్డులు పెరుగుతాయని భావిస్తున్నా అమెరికా స్టాక్‌ మార్కెట్లు నిన్న నిలదొక్కుకున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మన మార్కెట్లు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మన మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,782 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 136 పాయింట్లు నష్టపోయింది.


BSE Sensex


క్రితం సెషన్లో 52,930 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,565 వద్ద లాభాల్లో మొదలైంది. 53,785 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఉదయం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించడంతో 500 పాయింట్ల వరకు లాభపడింది. కానీ ఐరోపా మార్కెట్లు తెరిచాక 52,654 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 136 పాయింట్ల నష్టంతో 52,793 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 15,808 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,977 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల బాట పట్టింది. 16,083 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ఆఖర్లో అమ్మకాల సెగ తగలడంతో 15,740 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 150 పాయింట్ల లాభం నుంచి 25 పాయింట్ల నష్టానికి చేరకుంది. చివరికి 15,782 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో మొదలై నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,925 వద్ద మొదలైంది. 33,007 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,925 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 410 పాయింట్ల నష్టంతో 33,121 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, ఎం అండ్‌ ఎం, టైటాన్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టపోయాయి. బ్యాంక్‌, మెటల్‌, పవర్‌ సూచీలు 1-2 శాతం వరకు పతనం అయ్యాయి. ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ సూచీలు 1-2 శాతం ఎగిశాయి.