Nizamabad News: ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం సంపాధించి, కన్నవారి కళ్లలో సంతోషం చూడాలనుకున్నాడు. అందుకే అమెరికా వెళ్లాడు. కానీ అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు తెలుగు యువకుడు. రోడ్డు ప్రమాదంలో సజీవదహనం అయ్యాడు. కన్నవారు కడసారి చూపు కూడా చూసేందుకు వీలులేని స్థితిలో డెడ్ బాడీ ఉంది. అయితే కుమారుడి మరణవార్తలను తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే?


నిజామాబాద్ కు చెందిన సత్యం దంపతులకు ముగ్గురు పిల్లలు. వీళ్లలో శైలేష్ పెద్ద వాడు కాగా... ఆయనకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చుదువుతున్నారు. అయితే శైలేష్ న్యూజెర్సీలోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్ లో మాస్టర్ ఆఫ్ బయోమెడికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లోనే ఆయన అమెరికాకు వెళ్లాడు. ఈక్రమంలోనే శనివారం రోజు శైలేష్ కారులో వెళ్తుండగా.. మరో కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో శైలేష్ సజీవదహనం అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మతదేహాన్ని తెలంగాణలోని నిజామాబాద్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  



గుండెపోటుతో కెనడాలో నిజామాబాద్ విద్యార్థిని మృతి


నిజాబామాబాద్ జిల్లా మల్కాపూర్(ఏ) గ్రామ సర్పంచి వెంకటరెడ్డికి ఇద్దరు కుమారులు అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి, కుమార్తె పూజితా రెడ్డి ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. అలాగే పూజితా రెడ్డి ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాఆలలో బీడీఎస్ పూర్తి చేశారు. పీజీ చేసేందుకు జనవరి 26వ తేదీన కెనడా వెళ్లింది. సోదరుడు అరుణ్ రెడ్డి ఇంట్లో వారం ఉండి.. అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్ లో చేరింది. పది రోజుల కిందట హాస్టల్ లో ఉండగా.. ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన తోటి విద్యార్థులు, సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్సపొందుతూ పూజితా రెడ్డి మృతి చెందింది. 
అయితే అక్కడే ఉన్న పూజిత సోదరుడు ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చాడు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి కన్నుమూసిన కుమార్తెను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


మరోవిద్యార్థి ఫలిప్పీన్ లో మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రాంలింగంపల్లికి చెందిన గూడూరు రాంరెడ్డి, రాధ దంపతులకు 24 ఏళ్ల మణికాంత్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. అయితే వైద్య విద్య కోసం మణికాంత్ ఫిలిప్పీన్స్ లోని దావో మెడికల్ కాలేజీలో 2020లో చేరాడు. కరోనా కారణంగా కొద్ది రోజులు ఆన్ లైన్ లోని క్లాసులు విన్నాడు. గతేడాది ఆగస్టులో ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు. ప్రస్తుతం అతడు ఎంబీబీస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆదివారం రోజు తెల్లవారుజామున మణికాంత్ రెడ్డి ఉంటున్న హాస్టల్ మేనేజర్ రాంరెడ్డికి ఫోన్ చేసి తమ కుమారుడు చనిపోయినట్లు తెలిపారు. అయితే ముందుగా బైక్ యాక్సిడెంట్ లో చనిపోయినట్లు చెప్పిన ఆయన ఆ తర్వాత కాసేపటికే మెట్లపై నుంచి జారి పడి మృతి చెందినట్లు వివరించారు. మణికాంత్ రెడ్డి మృతదేహం ఫొటో, వీడియో పంపించారు. 


అయితే హాస్టల్ వెనుక డ్రైనేజీలో మణికాంత్ రెడ్డి మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. హాస్టల్ యాజమాన్యం, పోలీసులు చెప్పిన తీరు వేర్వేరుగా ఉండడంతో కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మణికాంత్ రెడ్డి డ్రైనేజీలో పడి ఉండడం, తలకు గాయం కావడంతో అది హత్యేనని ఆరోపిస్తున్నారు. కచ్చితంగా ఎవరో చంపే అతడిని డ్రైనేజీలో పడేసి ఉంటారని అంటున్నారు.