FPIs in May: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో మే నెలకు ఒక బ్లాక్‌ మార్క్‌ ఉంది. ఆ నెలకు సంబంధించి, "సెల్ ఇన్ మే & గో అవే" అనే మాట వినిపిస్తుంది. చరిత్రను తిరగేస్తే, ఏటా మే నెల అపఖ్యాతిని మూటగట్టుకుంటూ వచ్చింది. ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు), ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లో, మే నెలలో అమ్మకాలకు దిగడం, డాలర్లు మూటగట్టుకుని ఎగిరిపోవడం పరిపాటి. అందుకే, మే నెలల్లో స్టాక్‌ మార్కెట్‌లు డౌన్‌ట్రెండ్‌లో ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఆ ట్రెండ్ రివర్స్ అయింది. ఇది సాదాసీదాగా జరగలేదు, కళ్లు చెరిదే రేంజ్‌లో ట్రెండ్‌ మారింది.


రోజుకు ₹2,300 కోట్ల షాపింగ్‌
స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, ఈ ఏడాది మే నెలలో ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌లోకి డాలర్ల ప్రవాహం వచ్చి పడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదార్లుగా (net buyers) ఉన్నారు. గత నెలలో మన మార్కెట్‌లో ఏకంగా 48 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన కొనుగోళ్లు చేశారు. మే నెలలో మొత్తం 19 ట్రేడింగ్ రోజులు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే, ప్రతి రోజు సగటున 2,300 కోట్ల రూపాయలతో విదేశీ మదుపర్లు షేర్ల షాపింగ్‌ చేశారు.


ఎగిరి గంతేసిన స్టాక్ మార్కెట్
మే నెలలో ఫారిన్‌ ఇన్వెస్టర్లు నెట్‌ బయ్యర్స్‌గా మారడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా మంచి పనితీరు కనబరిచాయి. ఆ నెలలో, BSE 30 షేర్ సెన్సిటివ్ ఇండెక్స్ అయిన 'సెన్సెక్స్' (BSE Sensex) 1,500 పాయింట్లకు పైగా లేదా దాదాపు 2.5 శాతం లాభపడి 62,547.11 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా, NSE నిఫ్టీ50 (NSE Nifty) దాదాపు 470 పాయింట్లు లేదా 2.6 శాతం లాభంతో 18,534.10 పాయింట్ల వద్ద నిలిచింది.


NSDL డేటా ప్రకారం, మే 1 నుంచి మే 15 వరకు, తొలి పక్షం రోజుల్లో FPIల కస్టడీలో ఉన్న అసెట్స్‌  (Asset Under Custody - AUC) విలువ సుమారు రూ. 1.28 లక్షల కోట్లు పెరిగింది. ఏప్రిల్ 30 నాటికి ఇది రూ. 46.70 లక్షల కోట్లు కాగా, మే 15 నాటికి రూ. 47.98 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌ ముందంజలో ఉంది, దీని AUC వాల్యూ రూ. 44,297 కోట్లు పెరిగింది.


ఈ రంగాల్లోకి బంపర్ ఇన్‌ఫ్లో
డేటా ప్రకారం, మే నెలలో, ఆటో అనుబంధ రంగంలో ఫారిన్‌ ఇన్వెస్టర్ల AUC రూ. 22,300 కోట్లు పెరిగింది. FMCG సెక్టార్‌లోకి రూ. 15,856 కోట్లు ఇన్‌ఫ్లో, ఆయిల్ & గ్యాస్ సెక్టార్‌లోకి రూ. 10,668 కోట్ల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతోపాటుస మే మొదటి పక్షం రోజుల్లో కన్జ్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 5,800 కోట్ల నుంచి 8,500 కోట్ల వరకు పెరిగింది.


మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.