నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం (మార్చి 31) ఉదయం జరిగింది. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఎం. సనత్ అనే 21 ఏళ్ల యువకుడు హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య గల కారణాలు తెలియలేదు. సనత్ పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ ఫైనల్ పరీక్షలు పూర్తిచేసి ప్రాక్టికల్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో గడిచిన మూడు నెలల కాలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి మాసంలో అదిలాబాద్ జిల్లా జన్నారం మండలం చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న దాసరి హర్ష ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ సంఘటన నుంచి మెడికల్ కళాశాల విద్యార్థులు తేరుకోకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న వరుస సంఘటనలు విద్యార్థులను ఆందోళన గురిచేస్తున్నాయి. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
మరోవైపు, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పుప్పాల గూడలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లాకు చెందిన వినోద్ కుమార్ హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. గత ఐదు సంవత్సరాల క్రితం వినోద్ కుమార్ వివాహం జరిగింది. వినోద్ కుమార్ కు ఓ బాబు కూడా ఉన్నాడు. సంక్షోభం కారణంగా తన ఉద్యోగం కూడా పోతుందని తీవ్ర ఆందోళన చెందిన వినోద్ చనిపోయినట్లుగా తెలుస్తోంది. తీవ్ర మనస్తాపంతో గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని భావిస్తున్నారు.
అతను గదిలో నుండి ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో అన్న రాజేష్ కుమార్ గది తలుపులు పగలగొట్టాడు. లోపల ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన తమ్ముడిని చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.