నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సీతారామపురం బిట్-2 సచివాలయ మహిళా పోలీస్ జ్యోతి శ్రీవిద్య ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఛేదించారు. భర్త అనుమానంతోనే భార్య ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. ఆమె భర్త ప్రకాశరావుని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీ గౌతమ్ నగర్ కు చెందిన జ్యోతి శ్రీవిద్యకు, వింజమూరు మండలం జువ్విగుంటపాలెం గ్రామానికి చెందిన ప్రకాశరావుకి ఈ ఏడాది ఆగస్టులో వివాహమైంది. ఆమెకు వచ్చే ఫోన్లు, వాట్సాప్ మేసేజ్‌లు భర్త చెక్ చేస్తూ నిత్యం అనుమానంతో వేధించేవాడని తెలుస్తోంది. వివాహం జరిగి మూడు నెలలైనా గర్భం రాలేదని అత్తమామలు కూడా హింసించేవారు. ఈ విషయాలను తమ కుమార్తె ఎప్పటికప్పుడు తమతో చెప్పేదని శ్రీవిద్య తల్లిదండ్రులు అంటున్నారు. వేధింపులు భరించలేక ఈ నెల 2వ తేదీ పుట్టింట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె చనిపోయిన తర్వాత భర్త, అత్తమామలపై అనుమానం ఉన్నట్టు శ్రీవిద్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీవిద్య భర్త ప్రకాశరావుని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈనెల 2వ తేదీన మహిళా పోలీస్ శ్రీవిద్య ఆత్మహత్య జిల్లాలో సంచలనంగా మారింది. కొండరాజు, రమాదేవి దంపతుల కుమార్తె జ్యోతి శ్రీవిద్య, వయసు 31 సంవత్సరాలు. సీతారామపురం బిట్- 2 సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహించేవారు. ఆమె చెల్లెలు సంగీత కూడా అదే సచివాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్నారు. రోజూ అక్క చెల్లెళ్లు ఇద్దరూ ఇంటి నుంచి విధులకు వెళ్లి వస్తుంటారు. ఇద్దరు కుమార్తెలకు సచివాలయం ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.
అందరికీ ధైర్యం చెప్పాల్సిన మహిళా పోలీస్, కుటుంబ సమస్యలపై ధైర్యం చెప్పి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఓ బాధ్యతగల ఉద్యోగి ఇలా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దిశ యాప్ పై మహిళా పోలీసులే ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా దిశ యాప్ లో ఫిర్యాదు చేయాలని కూడా చెప్పారు. మరి తను కష్టాల్లో ఉంటే మహిళా పోలీస్ శ్రీవిద్యకు దిశ యాప్ గుర్తురాకపోవడం బాధాకరం. భర్త అనుమానాలు భరించలేక ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.
Also Read: Jagan Promise: నెల్లూరుకి సీఎం జగన్ ఇచ్చిన హామీ నెరవేరేనా..?
Also Read: వివాహేతర సంబంధం.. భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చిన మహిళ.. ట్విస్ట్ ఏంటంటే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి