నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన సీఎం జగన్ జిల్లాకు రెండు వరాలు ప్రకటించారు. నెల్లూరు నగర పరిధిలోని భగత్ సింగ్ నగర్ ప్రాంతంలో పెన్నాకు బండ్ నిర్మించడం అందులో ఒకటి. దీనికోసం 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారాయన. రెండోది నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్ పునర్నిర్మించడం. దీనికోసం 120కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేస్తామన్నారు.
బండ్ నిర్మాణం ఎందుకు..?
పెన్నానదికి వరదలు వచ్చినప్పుడు నెల్లూరు నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. పొర్లుకట్ట, వెంకటేశ్వర పురం ప్రాంతంలో కచ్చితంగా ఇళ్లలోకి నీరు రావాల్సిందే. గతంలో పెన్నాకు వరదలు రావడం అరుదుగా జరిగేది. అయితే గతేడాది, ఈ ఏడాది వరుసగా భారీ వరదలు రావడంతో నెల్లూరు తీరప్రాంత వాసులు ఇబ్బందులు పడ్డారు. దీనికి శాశ్వత పరిష్కారంగా పెన్నాకు బండ్ నిర్మిస్తామని చెప్పారు సీఎం జగన్. 100కోట్ల రూపాయలు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు.
నది సహజ ప్రవాహాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అదే సమయంలో నదీ గర్భంలోకి చొచ్చుకుని వచ్చే నిర్మాణాలను కూడా ఇటు అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. నెల్లూరులోని పొర్లు కట్ట ప్రాంతం దాదాపుగా నదీ తీరంలోకి చొచ్చుకుని వచ్చిందే. భగత్ సింగ్ కాలనీ కూడా తీరానికి అంచున ఉంటుంది. వరద తాకిడికి నీరంతా ఇళ్లలోకి చేరుతుంది. ప్రతి ఏడాదీ ఇది జరిగే తంతే. అయితే పేదలకు ఇళ్ల స్థలాలు దొరకడం కష్టం కావడంతో.. వారంతా పెన్నా తీరంలోనే ఇళ్లను నిర్మించుకుని ఉంటున్నారు. అదికారులు కూడా అప్పటికప్పుడు వాటిని చూసీ చూడనట్టు ఉంటున్నారు. విద్యుత్, మంచినీటి సౌకర్యాలను ఇస్తున్నారు. కానీ ఇలాంటి వరదల సమయంలో అసలు సమస్య వెలుగులోకి వస్తోంది. నదీ తీరంలో నిర్మించిన ఇళ్లలోకి వరదనీరు పోటెత్తుతోంది. వీటిని అక్రమ నిర్మాణాలుగా గుర్తించి తొలగించడానికి అటు అధికారులు సాహసం చేయలేరు. ఇటు నాయకులు వారి అవసరాలకోసం ఇలాంటి నిర్మాణాల జోలికి వెళ్లలేరు. ఇలా వరదలు వచ్చినప్పుడల్లా పరామర్శ యాత్రలు, హామీలు సహజంగా మారాయి.
పెన్నా ప్రవాహాన్ని బండ్ అడ్డుకోగలదా..?
పెన్నా ప్రవాహ తీవ్రతను కాంక్రీట్ నిర్మాణం అడ్డుకోగలదా..? ఉధృతి మరీ ఎక్కువైతే బండ్ నిర్మించి ఉపయోగం ఏంటి..? దానికి బదులుగా వందకోట్ల ఖర్చుతో భగత్ సింగ్ నగర్ వాసులకు సురక్షిత ప్రాంతంలో శాశ్వత పునరావాసం కల్పించొచ్చుకదా. ప్రతిపక్షాలు ఇవే ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఇసుకాసురుల వల్లే కరకట్టలు కోసుకు పోయి ఇలాంటి ముప్పు వాటిల్లుతోందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ముందు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కేసులు పెట్టాలని, అప్పుడే పెన్నా నది కోతకు గురికాదని చెబుతున్నారు.
హామీ నెరవేరుతుందా..?
పెన్నా తీరంలో బండ్ నిర్మించాలనేది చాలా కాలంనుంచీ ఉన్న ప్రతిపాదన. అయితే ఆ సాహసానికి ఎవరూ పూనుకోలేదు. ఇప్పుడు స్వయంగా సీఎం హామీ ఇచ్చారు కాబట్టి బండ్ నిర్మాణంపై ఆశలు పెట్టుకోవచ్చు. అయితే వరద ప్రవాహాన్ని ఆ కాంక్రీట్ నిర్మాణం అడ్డుకుంటుందా..? బండ్ నిర్మించడం వల్ల వరద తీవ్రత తీరప్రాంతాలపై పడకుండా ఉంటుందా అనేది ప్రశ్నార్థకం.