Natu Bombs In Kurnool: ఫ్యాక్షన్ జిల్లాలలో ఒకటిగా పేరున్న కర్నూలు జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. నాటు బాంబుల పేరు చెబితే స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పత్తికొండలో ఓ రైతు పొలంలో నాటు బాంబులు దొరికాయి. ఒకే ప్రాంతంలో గత నెల రోజుల క్రితం పత్తికొండ అటవీ ప్రాంతంలో పొలాల్లో పని చేసుకుంటున్న మహిళకు నాటు బాంబులు దొరికాయి అవి బాంబులా కాదా అని తెలుసుకునే ప్రయత్నం మహిళలు చేశారు. ఆ ప్రయత్నంలోనే ఒక మహిళ చేయి కోల్పోవాల్సి వచ్చింది.
పొలానికి వెళ్లాలంటే రైతులకు భయం భయం
నాటు బాంబుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పత్తికొండ నగరంలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే అటవీ ప్రాంతంలో పొలాల్లో ఒక నాటుబాంబు దొరకడం రైతులను కలవరపెడుతోంది. పొరపాటున నాటు బాంబుల మీద కాలుపెట్టినా, తాకినా అవి పేలతాయని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ సమీపంలో కర్నూల్ రోడ్డు లో ఉన్న శ్రీ శక్తి భవనం వెనకవైపు ఉన్న పొలాలలో నాటు బాంబు దొరకడం కలకలం రేపింది. పత్తికొండ పట్టణానికి చెందిన రైతు కొలిమి జాకీర్ పొలంలో నాటు బాంబు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.
కవర్‌లో చుట్టి పడేశారు !
పొలాలలో నాటు బాంబు ఉండడంతో చుట్టుపక్కల రైతులు, రైతు కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. కొలిమి జాకీర్ తన తల్లితో కలిసి రోజువారీ గానే ఉదయాన్నే పొలానికి వెళ్లగా పొలంలో నీలిరంగు కవర్ పడి ఉండటాన్ని జాకీర్ తల్లి చూడగా జాకీర్ నాట్ బాంబు లాగా ఉందని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నాటు బాంబును గుర్తించి దానిని నీటిలో వేసి నిర్వీర్యం చేశారు.
తరచుగా అదే ప్రాంతంలో నాటు బాంబులు
అదే ప్రాంతంలో రెండుసార్లు పొలాలలో నాటు బాంబులు లభ్యం కావడంతో రైతులు రైతు కూలీలు పొలాలలో పనికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ బాంబుల వెనుక ఎవరి హస్తం ఉందో పోలీసులు గుర్తించాలని రైతులు కోరుతున్నారు. గతంలో పట్టణంలో ఒక ఇంటిలో ఉంచిన బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. కానీ మరొకసారి పట్టణ సమీపంలోని పొలాలలో బాంబులు దొరకడంతో వన్యప్రాణులు చంపడానికి బాంబులు పెట్టారా లేక ఎవరినైనా చంపడానికి బాంబులు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Gun Fire At BSF Camp: బీఎస్ఎఫ్ క్యాంపులో కాల్పులు - ఐదుగురు జవాన్లు మృతి, ఆరుగురికి గాయాలు
Also Read: Cat Bite: కృష్ణా జిల్లాలో విషాదం - పిల్లి కరవడంతో ఇద్దరు మహిళలు మృతి, అసలేం జరిగిందంటే !