మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఇద్దరి బాలికల అదృశ్యం అయ్యారు. దుండిగల్ పీఎస్‌ పరిధిలోని సూరారంలోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారీ విద్యార్థినులు. 


నిన్న సాయంత్రం స్కూల్‌ విడిచిపెట్టిన ఎంతసేపైనా బాలికలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్కూల్‌కు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఎటు వెళ్లారనే కంగారు తల్లిదండ్రుల్లో మొదలైంది. 


సూరారం ప్రభుత్వ పాఠశాల పరిసరాలను క్షణ్ణంగా పరిశీలించారు. ఎటైనా వెళ్లారా.. లేకుంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న భయపడి స్నేహితులందరితో మాట్లాడారు. ఏం జరిగిందో తమకు తెలియదని వాళ్లంతా సమాధానం చెప్పారు. 


స్నేహితుల సమాచారంతో తల్లిదండ్రుల్లో కంగారు మరింత ఎక్కువైంది. స్కూల్‌ పక్కనే ఉన్న ఓ చెరువు వద్ద చూస్తే ఇద్దరి బాలికల స్కూల్‌ బ్యాగ్‌లు మాత్రం దొరికాయి. చెరువులో దూకి ఉంటారన్న అనుమానంతో చెరువులో వెతకారు. అయినా వాళ్లకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. 


ఫిర్యాదు అందుకున్న పోలీసులు కట్ట మైసమ్మ చెరువు గట్టున  ఉన్న  బ్యాగులు పరిశీలించారు. ఏం జరిగిందో సన్నిహితులందర్నీ ప్రశ్నిస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులను విచారించారు. నిన్న ఆ విద్యార్థులు ఎలా ఉండేవారు, ఏమైనా చెప్పేవాళ్లా అన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు. 


చదువు ఒత్తిడి ఏమైనా ఉందా లేకుంటే ఇంకా వేరే వేధింపులు ఏమైనా ఉన్నాయా... ఇంట్లో ఎలా ఉండేవాళ్లు, ఎంతటైం చదివేవాళ్లు, మార్కులు ఎలా వచ్చేవి అని తల్లిదండ్రుల నుంచి ఆరా తీస్తున్నారు పోలీసులు. 


తమ బిడ్డలు కనిపించకుండా పోయి సుమారు ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఏం జరిగి ఉంటుందో అన్న అయోమయం వారిలో కనిపిస్తోంది.