Governor Tamilisai: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం(Governor Speech) లేకపోవడంపై తమిళిసై స్పందించారు. బడ్జెట్ సమావేశాల్లో(Budget Session) గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ(Assembly) సమావేశాల కొనసాగింపులో భాగంగానే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం చెప్పడం సరికాదని గవర్నర్ అన్నారు. ఐదు నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, గత సమావేశాల కొనసాగింపు అనడం రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడమే అని తమిళి సై అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్‌(Governor) కోరారు. రాజకీయాలకు అతీతంగా ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామన్నారు. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని తమిళి సై అన్నారు. 


సభ్యుల హక్కులకు విఘాతం 


బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడం వల్ల గత ఏడాదిగా ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారని గవర్నర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 7వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు మొదలు కానున్నాయి. సాధారణంగా బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం అనవాయితీగా ఉంటుంది. గత సమావేశాల కొనసాగింపు అని ప్రభుత్వం గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. బీజేపీ, కాంగ్రెస్‌.. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం తెలిపాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారమే గవర్నర్‌ ప్రసంగం లేదని చెప్పిందని ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యవహారంపై రాజ్‌భవన్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.


బడ్జెట్ సమావేశాలు


మార్చి ఏడో దేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆరో తేదీన మంత్రివర్గ ( Cabinet Meeting ) సమావేశం జరిపి బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. ఏడో తేదీనే అసెంబ్లీలో బడ్దెట్ ప్రవేశ పెట్టనున్నారు. సాధారణంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగాన్ని వద్దనుకున్న కేసీఆర్ మొదటి రోజే ఆర్థిక మంత్రి హరీష్ రావు ( Harish Rao ) చేత బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్ గవర్నర్‌ను ఇటీవలి కాలంలో లెక్క చేయడం లేదు. గవర్నర్ వ్యవస్థ ఉనికిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లోనూ కేసీఆర్ పాల్గొనలేదు. మేడారం పర్యటనకు గవర్నర్‌కు హెలికాప్టర్ ఇవ్వకపోవడమే కాదు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌నే స్కిప్ చేశారు.