Nalgonda Car In Canal: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద నిన్న సాగర్ కాలువలో అనుమానాస్పదంగా కొట్టుకువచ్చిన కారు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. కాలువలో కారు కేసులో సస్పెన్స్ కు తెరపడింది. కారును కాల్వలో తోసేసింది అక్కా తమ్ముళ్లుగా గుర్తించారు పోలీసులు. మతిస్థిమితం సరిగా లేని కారణంగానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కారును కాలువలోకి తోసేసింది ఇద్దరు దివ్యాంగులుగా గుర్తించడం ట్విస్ట్‌గా మారింది.
రిటైర్డ్ టీచర్ పిల్లలు ఇలా చేశారా..
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ రామాంజనేయులుకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఓ కుమారుడు మల్లికార్జున్, కూతురు విఘ్నేశ్వరి కొంతకాలం నుంచి విభేదాల కారణంగా తండ్రికి దూరంగా ఉంటున్నారు. అంతకు ముందు తండ్రి తనని ఆదరించడం లేదంటూ పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. ఈ వివాదాలు కొనసాగుతుండగానే పార్కింగ్ చేసిన కారు పోయిందని మిర్యాలగూడ రూరల్ పీఎస్ లో రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడలో మిస్సయిన ఆ కారే... ఇప్పుడు వేముల కాల్వలో ప్రత్యక్షమైంది.
దేవుళ్లమని వాదిస్తున్న మల్లికార్జున్, విఘ్నేశ్వరి..
మిర్యాలగూడలో మిస్సయిన కారు కేసుపై రిటైర్డ్ హెడ్‌మాస్టర్ రామాంజనేయులు స్పందించారు. తనపై కోపంతోనే కూతురు విఘ్నేశ్వరి, కుమారుడు మల్లికార్జున్ ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు దిగి ఉండొచ్చునని ఆయన భావిస్తున్నారు. తాము దేవుళ్లం అని కొన్నేళ్లుగా తనతో వాదిస్తున్నారని, గత నాలుగైదేళ్లుగా ఈ పిల్లలిద్దరూ తన నుంచి దూరంగా ఉంటున్నారని తెలిపారు. మిర్యాలగూడ మండలం అవంతిపురంలో ఉంటున్న మల్లికార్జున్, విఘ్నేశ్వరి కొన్ని రోజుల కిందట ఓ కారు కొనగా, మెయింటనెన్స్ డబ్బులు తండ్రి నుంచి తీసుకుంటున్నారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదుగానీ తనపై కక్ష సాధింపు కోసం కారును తీసుకెళ్లి కాల్వలోకి తీసేసి ఉంటారని పోలీసులకు రామాంజనేయులు తెలిపారు.
కొంతకాలంగా తమ పిల్లలు డిప్రెషన్ లో ఉన్నారనీ, ఆ బాధతోనే ఏవో ప్రార్థనలు సైతం మొదలుపెట్టారని చెప్పారు. కారును తీసుకెళ్లి అన్నపురెడ్డి గూడెం దగ్గర కాలువలోకి తోసేసి ప్రమాదంగా, ఆత్మహత్యగానో చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు ఆరా తీయగా దివ్యాంగులు మల్లికార్జున్, విఘ్వేశ్వరీలు కారును కాల్వలోకి తోసేశారని వీరి తండ్రి రామాంజనేయులు చెబుతున్నారు. కాలువలోంచి కారును బయటకు తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది.
కారు మిస్సింగ్..
మిర్యాలగూడలోని థియేటర్ వద్ద పార్క్ చేసిన కారు చోరీ అయిందని విఘ్నేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అర్ధరాత్రి 12 గంటలకు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. నిన్న సాగర్ కాలువలో కారును గుర్తించినా, రెస్క్యూ టీమ్ బయటకు తీయలేకపోయింది. నేడు గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు తీసేందుకు శ్రమిస్తున్నారు. కారులో లగేజీ ఉంచి మరి తోసేసి ఉంటారని స్థానికులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Tragedy In Holi Celebrations: హోలీ వేడుకల్లో విషాదం - రంగులు కడుక్కునేందుకు వెళ్లి 12 మంది మృతి
Also Read: Gachibowli Accident : ఎగిరి పుట్ పాత్ పైన పడిన కారు, గచ్చిబౌలిలో రోడ్ టెర్రర్ - ముగ్గురు మృతి