మానసిక వికలాంగురాలు అయిన మనవరాలి వైద్యానికి డబ్బులు ఖర్చు చెయ్యాల్సి వస్తుందని కోడలితోపాటు ఇద్దరి మనవరాళ్లను ఎండలో వదిలి ఇంటికి తాళం వేసిందో అత్త.
విశాఖలోని జయప్రకాశ్ నగర్‌లో ఉండే జగన్ మోహన్, గౌరీ దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు. బాధితురాలి బంధువులు చెబుతున్న దాని ప్రకారం గత కొంతకాలంగా జగన్ మోహన్ కుటుంబ కారణాల రీత్యా గౌరీదేవితో గొడవ పడుతున్నాడు. అందులోనూ మానసిక వికలాంగురాలు అయిన పెద్దకుమార్తె వైద్యం కోసం డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావడం కూడా భార్య గౌరీ దేవితో గొడవ పడడానికి కారణం అయింది. దానితో భార్యా పిల్లలను వదిలేసి తన తల్లి రాజేశ్వరితో కలిసి వేరే చోట నివాసం ఉంటున్నాడు.
ఒంటరిగా ఉంటున్న గౌరీదేవి,పెద్ద కుమార్తెను డాక్టరు దగ్గరకు తీసుకెళ్లి తిరిగివచ్చే సరికి ఆమె ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళను వివరాలు అడగ్గా ఆమె అత్త రాజేశ్వరి వచ్చి కోడలు, మనవరాళ్లు లేని సమయంలో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయిందని చెప్పారు. విషయం తెలుసుకున్న కోడలు గౌరీదేవి అత్తకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయిందని చుట్టుప్రక్కల వాళ్ళు చెబుతున్నారు.
చేసేదిలేక తన ఇద్దరు కూతుళ్ళతో గౌరీ దేవి మండుటెండలో తాళం వేసిఉన్న ఇంటిముందు అలానే కూర్చుండి పోయి ధర్నాకు దిగింది . అసలే నడివేసవి ఎండలో ఇద్దరు కూతుళ్లతో మిట్టమధ్యాహ్నం వేళ రోడ్డుపై కూర్చుండి పోయిన గౌరీ దేవిని చూసి తరుక్కుపోయిన చుట్టుపక్కల వాళ్ళు ఆమె పుట్టింటి వారికి కబురు ఇవ్వడంతో గౌరీ దేవి అన్నయ్య వచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అలానే ఎండలో ఉండిపోయిన గౌరీ దేవి విషయం తెలుసుకున్న వైజాగ్ ఎయిర్ పోర్ట్ పరిధి పోలీసులు వచ్చి ఇంటి తాళం తీయించారు. దానితో సాయంత్రం వరకూ ఎండలోనే పిల్లలతో అవస్థ పడిన గౌరీ దేవి ఇంటి లోపలికి వెళ్లగలిగింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు గౌరీదేవి అత్త,భర్త లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు గౌరీ దేవి అన్నయ్య తెలిపారు. ఏదేమైనా ఒకవైపు సీఎం పర్యటన విశాఖలో జరుగుతున్న సమయంలోనే ఇలా ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్లతో ఇంటి నుండి గెంటివేయబడ్డ సంఘటన జరగడం నగరం లో సంచలనం సృష్టించింది.
శ్వేత ఆత్మహత్య ఘటనలోనూ అత్తింటి ఆరళ్ళదే కీలక పాత్ర
కొన్ని రోజుల క్రితం ఏపీలో సంచలనం సృష్టించిన 6 నెలల గర్భవతి శ్వేత ఆత్మహ్యత్య ఘటనలో కూడా పోలీసులు ఆమె అత్తమామలు, భర్త, ఆడపడుచు భర్తను అదుపులోకి తీసుకున్నారు. అత్తింటి వారు పెట్టిన టార్చర్ కు తోడు వరుసకు అన్నయ్య అయ్యే ఆడపడుచు భర్త ఏకంగా లైంగిక వేధింపులకు పాల్పడడం వల్లే శ్వేత ఆత్మహత్యకు పాల్పడింది అన్న ఆరోపణలు ఉన్నాయి.
కంప్యూటర్ యుగం లోనూ ఆడపిల్లలకు తప్పని అత్తింటి వేధింపులు
ఒకవైపు కాలం వేగంతో ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా ఆడపిల్లలకు మాత్రం అత్తింటి వేధింపులు తప్పడం లేదు అంటున్నారు సామాజిక వేత్తలు. వైజాగ్ లాంటి స్మార్ట్ సిటీలో కూడా ఇలాంటి సంఘటనలు ఆడపిల్లలకు ఎక్కువగా ఎదురవుతుండడం బాధాకరం అంటున్నారు వారు ఉన్నారు.