BRS JDS : కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్ ముగిసీ ముగియక ముందే జేడీఎస్ నేత కుమారస్వామి ఓ నిరాశజనకమైన ప్రకటన చేశారు. తమకు డబ్బులు లేకపోవడం వల్ల కనీసం పాతిక సీట్లలో గెలవలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న కుమారస్వామి ఇలా ఆర్థిక పరమైన అంశాలపై ఎందుకు పోలింగ్ ముగియగానే మాట్లాడారో చాలా మందికి అర్థం కాలేదు కానీ.. బీఆర్ఎస్ వైపు నుంచి అందుతుందనుకున్న సహకారం అందకపోవడం వల్లనే ఆయన ఈ అసంతృప్తి వ్యక్తం చేశారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
కుమారస్వామిని సీఎం చేసుకుందామని గతంలో ప్రకటించిన కేసీఆర్
భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ ఇతర పార్టీలను దగ్గరకు తీసుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కలిసి పని చేద్దామని జేడీఎస్‌కు కేసీఆర్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ కూడా ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అని ప్రకటించారు. కుమారస్వామిని సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న రాయచూర్, గుల్భర్గా, బీదర్, గంగావతి, కొప్పోల్‌తో సహా తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో జరిపే ఎన్నికల బహిరంగ సభల్లో కుమారస్వామితో కలిసి వేదిక పంచుకోవాలని, ముఖ్యంగా బెంగళూరు మహానగరంలో నిర్వహించే ప్రచార కార్యక్రమాలు రోడ్ షోలలో భాగస్వామ్యం కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే అసలు కర్ణాటక ఎన్నికల గురించే ఎలాంటి ఆలోచన చేయలేదు. చివరికి బీఆర్ఎస్ నుంచి ఆర్థిక సాయం కూడా అందలేదని కుమారస్వామి అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.
అసెంబ్లీ సీట్లలో పోటీకి కుమారస్వామి అంగీకరించలేదా ?
కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే సెంబ్లీ సీట్లు ఇవ్వాలని పట్టుబట్టడంతో కుమారస్వామి అంగీకరించలేదని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఇస్తామని ప్రతిపాదించారని.. కానీ అసెంబ్లీలో సీట్లకావాల్సిదేనని కేసీఆర్ పట్టుబట్టడంతో కుమారస్వామి సమాధానమివ్వలేదని అంటున్నారు. అయితే పొత్తులు లేకపోయినా కేసీఆర్ తనకు పెద్దన్న లాంటి వారేనని కుమారస్వామి తరచూ చెబుతూ వస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం పట్టించుకోలేదు. ఆర్థిక సాయం పంపలేదని చెబుతున్నారు. చివరి క్షణంలో అయినా సాయం వస్తుందేమోనని.. కుమారస్వామి ఎంతో ఆశగా ఎదురు చూశారని కానీ ప్రయోజనం లేకపోయే సరికి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేసీఆర్ మౌనంగా ఉండటానికి జాతీయ రాజకీయాలు కూడా కారణమా ?
ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయ విషయంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఢిల్లీలో పార్టీ ఆఫీసును ప్రారంభించినట్లుగా కూడా ఎవరికీ తెలియనంత కామ్ గా నిర్వహించారు. ఏ రాష్ట్రంలోనూ నాయకుల్ని పిలిచి కండువా కప్పాలని అనుకోవడం లేదు. కేవలం ఒక్క మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వారిని మాత్రం పిలిపించుకుని కండువాలు కప్పుతున్నారు. ఏపీ, ఒడిషా ఇంచార్జులను నియమించారని ఎలాంటి కార్యకలాపాలు లేవు. కర్ణాటకలోనూ పట్టించుకోలేదు.