టెక్నాలజీ సాయంతో డబ్బు అపహరించే మోసాలు భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయని తాజా సర్వేలో వెల్లడైంది. బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తున్నామని నమ్మిస్తూ.. బ్యాంకు వివరాలు, ఓటీపీ నంబర్లు, క్రెడిట్ కార్డు డిటైల్స్ తీసుకుంటున్నారని తేలింది.
భారతదేశంలో గడిచిన 12 నెలల్లో దాదాపు 69 శాతం మంది టెక్నాలజీ స్కామ్‌ల బారిన పడినట్లు వెల్లడైంది. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ స్కామ్‌ల బాధితులుగా ఉన్నట్లు స్పష్టమైంది. ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేను నిర్వహించడానికి ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ యూగవ్ (YouGov) ను నియమించింది. గ్లోబల్ టెక్ సపోర్ట్ స్కామ్ రీసెర్చ్ పేరుతో తన నివేదిక వివరాలు వెల్లడించింది. 
భారత్ సహా 16 దేశాల్లో మే 6 నుంచి ఈ ఏడాది మే 17 మధ్య ఈ సర్వే నిర్వహించింది. దీనికి గానూ 16,254 మంది ఇంటర్నెట్ యూజర్లను పరిశీలించింది. అపరిచిత వ్యక్తుల నుంచి మెసేజ్‌లు, ఈమెయిల్స్ రావడం, అడ్వర్టైజ్‌మెంట్ల రూపంలో పాప్అప్స్ కనిపించడం వంటివి జరుగుతుంటాయని.. వీటిని క్లిక్ చేయడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నట్లు 47 శాతం మంది వెల్లడించారు. 
ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాలు కూడా ఎక్కువైనట్లు సర్వేలో తేలింది. బ్యాంకులు, కంపెనీల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి అపరిచిత వ్యక్తులు బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నట్లు వెల్లడైంది. ఇలాంటి తరహా మోసాలు 2018 నుంచి ఎక్కువగా జరుగుతున్నాయని నివేదికలో తెలిపింది. 2018లో కూడా మైక్రోసాఫ్ట్ ఇదే తరహా సర్వేను నిర్వహించింది. 2018లో కాల్స్ ద్వారా చేసే మోసాలు 23 శాతం ఉండగా.. ప్రస్తుతం ఇది 31 శాతానికి పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో జరిగే మోసాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. 



  • బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌ల పేరిట 43 శాతం, గిఫ్ట్‌ కార్డుల వల్ల 38 శాతం, పేపాల్ కారణంగా 32 శాతం, క్రెడిట్ కార్డుల పేరుతో 32 శాతం, బిట్‌కాయిన్‌ కారణంగా 25 శాతం మంది డబ్బులు కోల్పోయినట్లు పేర్కొంది.

  • భారతదేశంలో ఒక్కో వ్యక్తి సగటున రూ.15,334 మేర డబ్బులు కోల్పోయినట్లు తెలిపింది. వీరిలో 88 శాతం మంది తాము పోగొట్టుకున్న సొమ్ములో కొంత మొత్తాన్ని (సగటున రూ.10,797) రాబట్టగలిగారని పేర్కొంది. 

  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురిలో ముగ్గురు టెక్ మోసాల బారిన పడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. 24 నుంచి 37 ఏళ్ల మధ్య వయసున్న వారు, 18 నుంచి 23 ఏళ్ల మధ్య వారే ఎక్కువగా మోసపోతున్నట్లు తెలిపింది.
    ఎలా తప్పించుకోవాలి?

  • గిఫ్ట్స్, అధిక వడ్డీ, ఉచిత పథకాలు అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడుతున్నవారిలో ఎక్కువ మంది విద్యావంతులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఏ బ్యాంకు సిబ్బంది కూడా ఫోన్ చేసి కార్డు వివరాలు అడగరని.. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని సూచిస్తున్నారు. 

  • బ్యాంక్, ఫైనాన్షియల్, కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమని ఎవరైనా ఫోన్‌ చేసి బ్యాంకు వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు అడిగితే ఇవ్వవద్దని చెబుతున్నారు. ఈమెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపించినా వాటిని తెరవవద్దని సూచిస్తున్నారు.

  • ఇంటర్నెట్‌లో దొరికే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోకూడదని చెబుతున్నారు. ఫోన్‌ను ఎప్పటికప్పుడు యాంటీ వైరస్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.