హైదరాబాద్ శివారులోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కారు అత్యంత వేగంగా ఢీకొంది. ఈ ఘోర ప్రమాద ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్‌లోనే మరణించారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దుండిగల్‌లోని బౌరంపేట కోకాకోలా కంపెనీ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తు అని పోలీసులు వెల్లడించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫూటుగా మద్యం తాగిన యువకులు కారు నడుపుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో బౌరంపేట కోకాకోలా కంపెనీకి సమీపంలో కారు రాగానే ఆగి ఉన్న ట్రక్కును బలంగా వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని ఏలూరు, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. చరణ్‌ అనే వ్యక్తిది విజయవాడ కాగా.. సంజూ, గణేశ్‌ అనే వారిది ఏలూరు అని పోలీసులు వెల్లడించారు. గాయపడిన అశోక్‌ ప్రస్తుతం సూరారంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 


ప్రమాదం జరిగిన సమయంలో చరణ్‌ అనే వ్యక్తి కారు నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి మద్యం మత్తులో కారు అతివేగంగా నడపడమే కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. కాగా, వీరంతా నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


నల్లకుంటలో మరో ప్రమాదం
మద్యం మత్తులో హైదరాబాద్‌లో మరో ప్రమాదం జరిగింది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున విద్యానగర్ రైల్వే బ్రిడ్జిపైకి ఓ కారు దూసుకొచ్చింది. అది అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అయితే, ఉదయం పూట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నడిపే వ్యక్తి మద్యం సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో అతనికి పోలీసులు శ్వాస పరీక్షలు చేయగా.. 90 శాతం రీడింగ్ చూపించింది. దీంతో పోలీసులు కారును సీజ్ చేసి, వాహనదారుడిపై కేసు నమోదు చేశారు.


Also Read: Hyderabad: రెండేళ్లుగా మరో మహిళతో సీక్రెట్ సహజీవనం... సీన్ కట్ చేస్తే భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు...


Also Read: Vijayawada Crime: అట్టిక గోల్డ్ కంపెనీలో చోరీ... ఇంటి దొంగ పనే... రెండు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు


Also Read: Hyderabad: నా భర్త సైకోలా వేధించాడు... సూసైడ్ నోట్ రాసి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి