Family attempts suicide in Mancherial District | ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య(60), శ్రీదేవి(50) దంపతులు గ్రామంలో కిరాణం షాప్ నడుపుతూ, పాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించేవారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె.. కుమార్తె చైతన్య (30) వికలాంగురాలు.


అప్పులు చేసి మరీ పెట్టుబడి.. తీవ్ర నష్టాలతో ఆత్మహత్యాయత్నం


వీరి కుమారుడు శివప్రసాద్(26) త్వరగా డబ్బు సంపాదించాలని భావించాడు. ఉద్యోగంతో అంత త్వరగా డబ్బు సంపాదించలేమని, చేస్తున్న ఉద్యోగం మానేసి అప్పులు చేసి మరి ఆన్ లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుండేవాడు. ఈ క్రమంలో పెట్టుబడికి లాభాలకు బదులు తీవ్రంగా నష్టపోయాడు. మరోవైపు అప్పులు ఇచ్చిన వారు బాకీ చెలించాలని ఒత్తిడి చేయడంతో వేరే గత్యంతరం లేక కుటుంబం మొత్తం మంగళవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు వీరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగర్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Also Read: Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు 


ఎవరైనా కష్టపడి ఒక్కో రూపాయి పోగు చేస్తేనే అధిక మొత్తం అవుతుంది, కానీ తక్కువ సమయంలో ఏదో చేసేయాలని, ధనవంతులం అయిపోవాలని ప్రయత్నిస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. షేర్ మార్కెట్ అనేది ఓ సముద్రం లాంటిదని ఏ అవగాహన లేకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు ఎప్పటికప్పుడూ సూచిస్తూనే ఉంటారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా, తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెడుతూ అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.