తల్లిపై ఉన్న ఎనలేని ప్రేమ మృత దేహాన్ని .. ఓ కుమారుడిని చేయకూడని పని చేయించింది. అమ్మ చనిపోయి చాలా నెలలు గడిచినా ఆమె జ్ఞాపకాలు మర్చిపోలేని కొడుకు ఏకంగా సమాధి నుంచి ఆమె శవాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే దాచుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అంత్యక్రియలు జరిగిన 11 నెలల తర్వాత కూడా కుమారుడు ఇలాంటి ఘటనకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా పరవాయి గ్రామానికి చెందిన బాలమురుగన్ అనే 38 ఏళ్ల వ్యక్తికి తండ్రి చిన్నప్పుడే మృతి చెందాడు. అతని తల్లి ముక్కాయి కష్టపడి పెంచి పెద్ద చేసింది. చిన్నతనంలోనే బాల మురుగన్ కాస్త మతి స్తిమితం కోల్పోయాడు. దీంతో తల్లి బయటికి పంపేది కాదు. ఏ పనికి వెళ్లకుండా మొత్తం ఇంటికే పరిమితం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి ముక్కాయి 11 నెలల క్రితం చనిపోయింది. చిన్న తనంతో పోలిస్తే మరింతగా మతి స్తిమితం కోల్పోయిన బాల మురుగన్.. తల్లి చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆమె జ్ఞాపకాలు మర్చిపోలేక తరచూ తల్లిని అంత్యక్రియలు చేసిన శ్మశానం చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. చివరికి వర్షం పడుతున్నప్పుడు కూడా తల్లి వద్దనే ఉండి ఆమె ఫొటో ఉన్న పెద్ద ఫ్లెక్సీని తల్లి సమాధిపై కప్పేవాడు. తరచుగా రాత్రుళ్లూ తల్లి సమాధిపైనే పడుకొనేవాడు.
ఈ క్రమంలో ఎప్పట్లాగే గత శుక్రవారం రాత్రి బంధువుల అమ్మాయి అతనికి అన్నం, కూర ఇచ్చేందుకు బాల మురుగన్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో నుంచి తీవ్రంగా దుర్వాసన రావడం గమనించి.. బాల మురుగన్‌ను ఆరా తీసింది. దీంతో ఆమెను బయటకు వెళ్లిపోమ్మని అతను గద్దించాడు. అనుమానం వచ్చి అమ్మాయి చుట్టుపక్కల వారికి ఆ విషయం చెప్పింది. అందరూ వెంటనే అతని ఇంట్లోకి బలవంతంగా వెళ్లి చూశారు. అక్కడ ముక్కాయి మృతదేహం ఉండడాన్ని గమనించి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృత దేహాన్ని పెరంబలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారు దర్యాప్తు చేపట్టారు. రోజూ కొద్దికొద్దిగా సమాధి తవ్వి తల్లి శవాన్ని చెత్త బండిలో పెట్టుకొని అర్ధరాత్రి ఎవరూ చూడని సమయంలో ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. శవాన్ని ఖననం చేస్తే బాలమురుగన్ మళ్లీ తవ్వి తీసే అవకాశం ఉండడంతో ఈసారి పోలీసులు దహనం చేశారు.
Also Read: Hyderabad: పాత పనిమనిషి మెగా ప్లాన్.. దాన్ని అమలు చేసిన కొత్త పనిమనిషి, ఓనర్‌కే కుచ్చుటోపీ!
Also Read: Karimnagar: కరీంనగర్ జిల్లాలో పోలీసుల భారీ తప్పిదం.. ఇదే హాట్ టాపిక్, డీజీపీ వరకు వెళ్లిన వ్యవహారం