సినిమా రేంజ్‌లో పథకం పన్ని పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దొంగతనం కేసును పోలీసులు అతి తక్కువ వ్యవధిలో చేధించారు. హైదరాబాద్‌లోని అమీర్ పేట్‌లో ఈ ఘటన జరిగింది. బ్రాండెడ్ ఫ్యాన్ల దుకాణం నిర్వహిస్తున్న వ్యాపారి వినోద్ పొద్దర్ అనే వ్యక్తి ఇంట్లో ఈ చోరీ జరిగింది. దాదాపు 39 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల సొమ్ము చోరీకి గురైంది. ఈ మేరకు బాధితుడు వినోద్ పొద్దర్ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను ఒకే రోజులో పట్టుకున్నారు.
సినిమాలో తరహాలో జరిగిన ఈ చోరీని హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. అమీర్ పేటలో వ్యాపారి వినోద్ పొద్దర్ ఇంట్లో భారీ చోరీకి పాల్పడింది గతంలో పని చేసిన పని మనిషి, ప్రస్తుత పని మనిషి అని గుర్తించారు. వారితో పాటు ఇద్దరికీ సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అమీర్‌పేట ధరంకారమ్ రోడ్డులోని అంజనీ టవర్స్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్యాన్ల వ్యాపారి వినోద్ పొద్దర్ నివాసం ఉంటున్నారు. ఈయన కొన్నేళ్ల నుంచి ఇంట్లో పనిని పని మనిషిని పెట్టి చేయించుకుంటున్నాడు. ఇంట్లో గురువారం చోరీ జరిగింది.
ఆ సమయంలో ఇంట్లో పని మనిషి అర్చనను విచారణ జరపగా తనపై దొంగలు దాడి చేశారని చెప్పింది. 39 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల డబ్బు చోరీ అయిందంటూ వినోద్ పొద్దర్ ఫిర్యాదు చేశారు. పని మనిషి అర్చనను తొలుత ప్రాథమికంగా అనుమానించిన పోలీసులు ఆమె ఫోన్ తీసుకొని పరిశీలించారు. గతంలో ఆ ఇంట్లో పని చేసి మానేసిన లక్ష్మితో పాటు గణేష్ అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. అర్చనను విచారిస్తున్న సమయంలో గణేష్ అక్కడి నుంచి మాయం అయ్యాడు. దీంతో పోలీసులకు వీరిపై అనుమానం మరింత బలపడింది. వెంటనే ప్రస్తుత పని మనిషి లక్ష్మిని తనదైన శైలిలో విచారణ జరిపారు.
సీసీటీవీ కెమెరాలు పరిశీలించడంతో దొంగతనం గుట్టు స్పష్టంగా బయటపడింది. చోరీకి పథక రచన చేసిన ప్రస్తుత పని మనిషి లక్ష్మితో పాటు, దాడి జరిగినట్లు నటించిన అర్చన, గణేష్, అతని కనుసన్నల్లో చోరీకి పాల్పడిన మిత్రుడు నవీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా కొట్టేసిన సొత్తును హకీం పేటలో దాచినట్లుగా గుర్తించారు. మొత్తం చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Karimnagar: కరీంనగర్ జిల్లాలో పోలీసుల భారీ తప్పిదం.. ఇదే హాట్ టాపిక్, డీజీపీ వరకు వెళ్లిన వ్యవహారం