Kurnool Crime News: ఎన్నెన్నో ఆశలతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల పాటు వీరి కాపురం హాయిగా సాగింది. ఈక్రమంలోనే భర్త.. తన భార్యను తన ఇంటికి రమ్మన్నాడు. అక్కడే కాపురం పెడదామని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈక్రమంలోనే భార్యపై విపరీతమైన కోపం పెంచుకున్న అతడు.. ఆమెను చంపేయాలనుకున్నాడు. వెంటనే ఓ పెద్ద కర్ర తీసుకొని వెళ్లి బాదాడు. కూతురును అల్లుడు చంపేస్తుండడంతో అడ్డుగా వెళ్లిన అత్తను కూడా అతడు చంపేశాడు. వీరిద్దరూ చనిపోయారని నిర్ధారించుకొని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. 


అసలేం జరిగిందంటే?


కర్నూలు జిల్లా కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి వాలంటీరుగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు కర్ణాటక రాష్ట్రంలోని టెక్కలికోటకు చెందిన రమేష్ తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. మహాదేవి తల్లి కూడా బాపూరం గ్రామంలో వీఆర్ఏ గా పని చేస్తోంది. పెళ్లైన తర్వాత కాపురానికి కర్ణాటక రావాలని రమేష్ తన భార్యను కోరాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. కర్నూలులోనే ఉందామని చెప్పింది. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రమేషే.. అర్థరాత్రి సమయంలో భార్యను హత్య చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ కర్ర తీసుకొచ్చి భార్యపై దాడి చేశాడు. అది గుర్తించిన అత్త అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడు. తల మీద తీవ్రంగా గాయాలు కావడంతో తల్లీ, కూతుర్లు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ చనిపోయినట్లు గ్రహించిన రమేష్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రమేష్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.  


ఇటీవలే కన్నకూతురిని బండకేసి కొట్టి తండ్రి


మద్యం మత్తులో ఓ చిన్నారిని కన్న తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మంగళగిరి నగర పరిధి నవులూరు ఎంఎస్ఎస్ కాలనీలో ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చనిపోయిన చిన్నారి వయసు రెండేళ్లు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గోపి - మౌనిక అనే భార్యభర్తలు నవులూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గోపి బేల్దారు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ మద్య కాలంలో మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగి రోజూ భార్యతో గొడవ పడే వాడు. ఇటీవలే కూడా పూటుగా  మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య మౌనికతో గొడవకు దిగాడు. ఇద్దరి మద్య ‌వాగ్వివాదం జరిగింది. 


పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోపి పట్టరాని ఆగ్రహంతో  తన పెద్ద కూతురు లక్ష్మీ పద్మను ఎత్తి నేలకేసి‌ కొట్టాడు. బండ తలకు బలంగా తగలడంతో ఆ పసి పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన చూసిన స్థానికులు ఒక్క సారిగా కిరాతక తండ్రి గోపీపై దాడి ‌చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి స్థానికుల నుంచి గోపీని రక్షించి స్టేషన్‌ కు తీసుకు వెళ్ళారు. పాప మృత దేహాన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి తండ్రి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడిని, అతణ్ని ఉరితీయాలని స్థానికులు ఆవేశంతో ఊగిపోయారు.