ఆవనూనెను కేవలం నిల్వ పచ్చలను తయారు చేయడానికి ఉపయోగిస్తారని అనుకుంటారు. కానీ ఆవనూనెతో జుట్టు సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంది. జుట్టు చిట్లి పోవడం,తెల్లబడడం, ఒత్తుగా పెరగకపోవడం వంటివన్నీ యువతను వేధిస్తున్న సమస్యలు. జుట్టు సమస్యలకు చెక్ పెట్టే సామర్థ్యం ఆవనూనెకు ఉంది. ఇంట్లోనే ఆవనూనె ఉపయోగించి జుట్టు అందంగా, ఒత్తుగా, పెరిగేలా చేసుకోవచ్చు. దీని కోసం మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
జుట్టును పెంచడంలో మెంతులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం ముందుగా మెంతులను పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఆవనూనె ఉన్న గిన్నెలో వేసి బాగా కలపాలి. స్టవ్ మీద వేరే గిన్నెతో నీటిని వేసి మరిగించాలి. అవి బాగా మరుగుతున్నప్పుడు ఆవనూనె ఉన్న గిన్నెను ఆ వేడి నీటిలో ఉంచాలి. గిన్నె మునిగిపోకుండా చూసుకోవాలి. ఆ సమయంలో నూనె వేడెక్కుతుంది. ఆ నూనె వేడెక్కాక గిన్నెను బయటకు తీసేయాలి. నూనెను వడకట్టి ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇది ఎక్కువ మొత్తంలో తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను తరచూ జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దన చేసుకోవాలి. రాత్రి మర్దనా చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. అవి పొడవుగా పెరుగుతాయి. రెండు నెలలు ఇలా ఆవనూనెతో మర్దన చేసుకుంటూ ఉంటే మీకే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక సీసాలో ఆవనూనె వేసి మెంతులు, కుంకుడు కాయలు, శీకాయ, ఉసిరికాయలు, కలోంజీ విత్తనాలు వేసి మూత పెట్టాలి. మూడు రోజుల పాటూ ఎండలోనే ఉంచాలి. ఆ తరువాత నూనెను తీసి తలకు పట్టించాలి. ఆ నూనెను వారానికి రెండు సార్లు రాసుకుంటే ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల నెల రోజుల్లోనే జుట్టు పెరగడం మొదలవుతుంది. ఎండలేకపోతే ఆవనూనెను స్టవ్ మీద వేడ చేసి పైన చెప్పినవన్నీ వేసి మరిగించాలి. ఆ నూనెను వడకట్టి దాచుకోవాలి.
ఆవనూనెను కాస్త వేడి చేసి రాసుకుంటే మంచి ఫలితాలు అందుతాయి. జుట్టు మొదళ్లలో ఉండే హెయిర్ ఫోలికల్స్ ఈ నూనెను గ్రహిస్తాయి. వెంట్రుకలకు పోషణను అందిస్తాయి. రాత్రి ఈ నూనెను రాసుకుని అలా వదిలేయాలి. ఉదయానే స్నానం చేయాలి. ఈ నూనెలో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది.
Also read: వాంగీ బాత్, వంకాయలతో ఇలా వేడి వేడి రైస్ చేసి తింటే అదిరిపోతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.