Konaseema District News: డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడలో విషాధ ఘటన చోటు చేసుకుంది. చర్చిపై హక్కుల గురించి ప్రతీ ఆదివారం ఇద్దరు పాస్టర్లు గొడవ పడుతున్నారు. ఇదే క్రమంలో నిన్న కూడా ఇద్దరు గొడవ పెట్టుకోగా కుటుంబ సభ్యులు, స్థానికులు ఆపేందుకు వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఓ మహిళపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ పికేట్ ఏర్పాటు చేశారు. 


గొడవకు కారణాలు ఏంటంటే..?


2018లో జొయ్, స్టీవెన్ అనే ఇద్దరు పాస్టర్లు చర్చిని నిర్మించారు. అయితే వారిద్దరిలో ఆ చర్చికి ఎవరూ పాస్టర్‌గా కొనసాగాలనే విషయంపై వారిద్దరికి గొడవ జరుగుతోంది. మొదటి నుంచి ప్రతీ ఆదివారం ఇద్దరూ గొడవ పడుతున్నారు. మొదట్లో గొడవ చిన్నగానే సాగినా ఇప్పుడు వివాదం మరింత తీవ్రం అయింది. అయితే ఇదే విషయం పోలీసుల వద్దకు చేరగా.. ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు ప్రార్థనలు చేయాల్సిందిగా సూచించారు. అలా జరుపు కోడానికి పాస్టర్ స్టీవెన్ అంగీకరించారు. కానీ రెండో పాస్టర్ జాయ్ మాత్రం చర్చిని విడదీయకూడదని, అందరూ సమష్టిగా ప్రార్థనలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషమయై నిన్న మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఓ పాస్టర్ కత్తితో దాడి చేయగా ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. 


రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాల తరఫు నుంచి కేసులు నమోదు చేశారు. అయితే రెండు వర్గాలను కూడా సుముదాయించే పనిలో పడ్డారు పోలీసులు అధికారులు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ పికేట్ ఏర్పాటు చేశారు.