2020–21 రబీ, ఖరీఫ్‌ సీజన్లకు సంబంధించి రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విడుదల చేశారు. ఖరీఫ్‌–2022 సీజన్‌లో వివిధ రకాల నేచర్ డిజాస్టర్స్ వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సోమవారం సీఎం జగన్‌ కాసేపట్లో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేశారు. రబీ 2020–21 సీజన్‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ.45.22 కోట్లు, ఖరీఫ్‌–2021 సీజన్‌లో అర్హులైన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.


‘‘దేవుడి దయ వల్ల మరో మంచికార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. దాదాపు 62శాతం మంది జనాభాకు వ్యవసాయ రంగమే ఆధారం. రైతును అన్నిరకాలుగా ఆదుకుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. దీన్ని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. మూడు సంవత్సరాల 5 నెలల కాలంలో ఇలానే పరిపాలన సాగింది. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ పంటరుణాలు కరెక్టుగా ఇస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆ సీజన్‌ ముగిసేలోగానే ఆ పరిహారం చెల్లిస్తున్నాం. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అయితే మళ్లీ మరుసటి ఏడాది ఆ సీజన్‌ రాకముందే క్రమం తప్పకుండా కొత్త ఒరవడిని తీసుకు వస్తున్నాం.


వ్యవసాయ రంగంలో ఇలా చాలా రకాల మార్పులను తీసుకు వచ్చాం. రైతన్నలకు మనం అందిస్తున్న ఇన్ పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ఇవాళ బటన్‌ నొక్కి మొత్తంగా రూ.200 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేస్తున్నాం. మొదటగా రైతన్నలకు అందిస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద, ఈ ఏడాది జులై- అక్టోబరు మధ్యలో కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రూ.40 కోట్లు ఇన్‌పెట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ 21.31 లక్షల మంది రైతులకు రూ.1834 కోట్లు ఇచ్చాం


సున్నా వడ్డీ పంటరుణాలకు సంబంధించి చూస్తే.. పంటలు వేసే ప్రతిసారికూడా పెట్టుబడికోసం బ్యాంకులనుంచి తెచ్చుకుని, వాటిని సకాలంలో కడితే వారికి సున్నా వడ్డీ అమలు చేస్తున్నాం. గత రబీ, ఖరీఫ్‌లో రుణాలు చెల్లించిన వారికి 8,22,411 రైతులకు రూ.160.55 కోట్లు ఇస్తున్నాం. అన్నదాతలకు అండగా నిలుస్తూ ఇ- క్రాప్‌ డేటా అధారంగా పారదర్శకంగా సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాలు ప్రదర్శించి.. లక్ష రూపాయల లోపు పంటలబీమా చెల్లించిన వారికి క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మన అందరి ప్రభుత్వం అధాకారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుని 73.88 లక్షల మంది రైతులకు రూ.1834.55 కోట్లు ఇచ్చాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో.. కొన్ని కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకు వస్తున్నాను.


చంద్రబాబుపై విమర్శలు
గతంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం లేదు. ఇప్పుడు అమలు చేస్తున్నాం. పంటల రుణాల పేరిట మోసం చేసిన పరిస్థితులు మనం చూశాం. చంద్రబాబు కట్టలేదు. తొలి సంతకంతో మాఫీ చేస్తానని చెప్పారు. కానీ, అప్పులమీద వడ్డీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు రైతును చిత్తు చేశాయి. బ్యాంకులు నోటీసులు ఇచ్చి వేలం వేసిన పరిస్థితులు చూశాం. ఆ ఐదు సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి రూ.15 వేల కోట్లు మాత్రమే, రూ.87,612 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.15వేల కోట్లు. అందుబాటులో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశాడు. గతంలో పంటల బీమా చూస్తే రైతులు తమ వాటా తామే కట్టుకున్నారు. ఆ ఐదేళ్లలో వరుసగా కరువు వచ్చింది. రైతులకు పరిహారం పెరగాలి.. కానీ అలా జరగలేదు. ఆ ఐదేళ్లలో బీమా కింద చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే.


మన ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా అమలు చేసింది. ఇ- క్రాప్‌ ద్వారా పంట వేసుకునే ప్రతి రైతుకూ వర్తించేలా ఆర్బీకేకు అనుసంధానం చేసింది. రైతుల ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఈ మూడేళ్లకాలంలో రూ.6,685 కోట్లు చెల్లించాలం. ప్రతి రైతుకూ ఇవాళ బీమా వర్తిస్తోంది. తేడా గమనించాలని కోరుతున్నా. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతన్నకు అండగా ఉండే ఆర్బీకేలు ప్రతి  గ్రామంలోనూ కనిపిస్తున్నాం. 10,778 రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ నాణ్యమైన సర్టిఫైడ్‌ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అభిస్తు్న్నాయి.


రైతులు నష్టపోకుండా ఈ చర్యలు చేపట్టాం. ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నాం. ఆర్బీకేలు రైతులకు సలహాలు ఇస్తున్నాయి. పారదర్శకంగా ఇ-క్రాప్‌ అమలు చేస్తోంది. పంట కొనుగోలు సమయంలోనూ సహాయకారిగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి గొప్ప వ్యవస్థ మన కళ్లముందే ఆర్బీకేల రూపంలో ఉన్నాయి. విలేజ్‌ అగ్రి అసిస్టెంట్లు ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారు. ఇలాంటి విధానం గతంలో లేదు. కనీసం ఆలోచన కూడా చేయలేదు.


గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది గమనించి చూస్తే.. గతంలో అశాస్త్రీయ విధానాలు ఉండేవి. రైతులకు పరిహారం అందుతుందా? లేదా? అనే పరిస్థితి ఉండేది. ఇన్‌పుట్‌ సబ్సిడీలను పూర్తిగా ఎగ్గొట్టిన సందర్భాలు చూశాం. రెండు మూడు సీజన్ల తర్వాత అరకొరగా ఇచ్చిన సందర్భాలూ చూశాం. ఇప్పుడు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆసీజన్‌లో ముగిసేలోగానే నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాం. ఏమైనా ఫిర్యాదులు ఉంటే విచారణ చేసి ప్రతి ఏటా డిసెంబర్‌, జులై మాసాల్లో అందిస్తున్నాం. మంచి చేస్తున్న ప్రభుత్వానికి కచ్చితంగా దేవుడి దయ ఉంటుంది. ఒక్క కరువు మండలాన్నీ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పోయింది:
ఇది దేవుడి దయ’’


చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో సగటున సగం మండలాలు కరువు మండలాలుగానే ఉండేవి. అంతటి కరువు వచ్చినప్పటికీ సహాయం కూడా అప్పుడు అంతంత మాత్రమే. గత ప్రభుత్వం విపత్తుల సహాయ నిధికి, ధరల స్థిరీకరణ నిధికి కేవలం ఎన్నికల వాగ్దానంగా మాత్రమే చేసింది. మన ప్రభుత్వం వీటిని అమల్లోకి తీసుకొచ్చి రైతన్నలకు తోడుగా నిలబడింది. 9 గంటలపాటు క్వాలిటీ విద్యుత్‌ను మన ప్రభుత్వం పగటిపూట అందిస్తోంది. ఫీడర్ల కెపాసిటీ గతంలో లేదు. దీన్ని మెరుగుపరుస్తూ రూ.1700 కోట్లు ఖర్చుచేశాం. గత ప్రభుత్వం పాడిరైతులకు ఎలా అన్యాయం చేయాలని చూస్తే.. మన ప్రభుత్వం అమూల్‌ ద్వారా వారిని  ఆదుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఆమూల్‌ ద్వారా పాలరేట్లు ఎలా పెరిగాయో రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం ధాన్యం సేకరణకు రూ.7-8 వేల కోట్లు ఖర్చు చేస్తే, మన ప్రభుత్వం రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇ- క్రాపింగ్‌ ద్వారా ఆర్బీకే కేంద్రం ద్వారా ఐడెంటిఫై చేసి.. గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టింది’’ అని సీఎం జగన్ మాట్లాడారు.